హైదరాబాద్: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు నికోల్ మార్క్‌రమ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం శనివారం సెంచూరియన్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు స్నేహితులు, బంధువులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
పెళ్లికి సంబంధించిన ఫొటోలను నికోల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. గత 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరూ గతేడాదే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా ఆటకు కాస్త బ్రేక్ ఇచ్చిన మార్క్‌రమ్ వివాహం చేసుకొని అంకుల్స్ క్లబ్‌లో చేరాడు. ఇక మార్క్‌రమ్ మామ సతీమణి నికోల్ చాలా అందంగా ఉందని, అత్త సూపరో సూపర్ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

కొందరైతే బాలీవుడ్ హీరోయిన్‌లా.. కత్తిలా ఉందని కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరికీ సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక నికోల్ ఆన్‌లైన్ వేదికగా ఓ జ్యూవెలరీ స్టోర్‌ను నడుపుతోంది. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ కేప్‌టౌన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మార్క్‌రమ్ మామ అరంగేట్ర సీజన్‌లోనే జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
దాంతో ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్రమోషన్ అందుకున్నాడు. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయాడు. మార్క్‌రమ్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. కనీసం వచ్చే సీజన్‌లోనైనా.. దుమ్మురేపాలని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అత్త రాకతో మామ తల రాత మారుతోందని, సన్‌రైజర్స్ దుమ్మురేపుతోందని జోస్యం చెబుతున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.