ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భువనేశ్వర్ కుమార్.. వరుసగా మూడు భారత్‌కే!

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మళ్లీ టీమిండియా క్రికెటర్‌కే దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో సత్తా చాటిన టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. మార్చి నెలకు గాను పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం భువీతో పాటు జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లు పోటీపడగా భారత్ పేసర్‌నే వరించింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అతను 6.38 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఇక గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సిరీస్‌లోనే భువీ సత్తా చాటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం విశేషం.
మూడూ భారత్‌కే..
ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడో అవార్డు కూడా టీమిండియా ఆటగాడికే దక్కడం విశేషం. జనవరి నెలకు వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫిబ్రవరి నెలకు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ అవార్డుకు ఎంపికవ్వగా.. మార్చి నెల అవార్డును భువీ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ ఎంపికయ్యారు. ఈ విభాగంలో లిజెల్ లీతో పాటు రేసులో ఇద్దరు భారత అమ్మాయిలు రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్ ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లిజెల్ లీనే ఈ అవార్డు వరించింది.

ఓటింగ్ ద్వారా విజేత..
మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.

సన్‌రైజర్స్ సంతోషం..
సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మార్చికి సంబంధించి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు సాధించాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ ఆడని భువి తర్వాత దేశవాళీ క్రికెట్‌లో రాణించి మళ్లీ టీమ్ఇండియాకు ఎంపికయ్యాడని, ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సందర్భంగా అత్యుత్తమ ప్రదర్శన చేసి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడని పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications