ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ముంబై ఇండియన్స్‌తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన 48 గంటల వ్యవధిలోనే ఆరెంజ్ ఆర్మీ మరో మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యింది. శుక్రవారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.
ముంబై చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇక నుంచి ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి సన్‌రైజర్స్ ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడి రెండేసి విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు అట్టడుగు స్థానంలో నిలవనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆ ఇద్దరిపై వేటు..?
ఘోర పరాజయాలతో చతికల పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లపైనే జట్టు మొత్తం ఆధారపడి ఉంది. ఈ ఇద్దరూ ఆడితేనే విజయం లేదంటే ఓటమి అన్నట్లుగా తయారైంది ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి. ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి ఘోర వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు తేలిపోతున్నారు. ముంబైతో మ్యాచ్‌కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీని పక్కన పెట్టారు. రూ. 10 కోట్లు పెట్టి కొన్న ఆటగాడిని పక్కన పెట్టారంటేనే షమీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. షమీ స్థానంలో బరిలోకి దిగిన జయదేవ్ ఉనాద్కత్ తేలిపోయాడు.
చెన్నైలోని చెపాక్ మైదానం స్లో వికెట్. పేసర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ వికెట్‌పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతారు. ఈ క్రమంలోనే షమీని మళ్లీ తుది జట్టులోకి తీసుకోవచ్చు. అదే జరిగితే జయదేవ్ ఉనాద్కత్‌పై వేటు పడనుంది. మరోవైపు వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఇషాన్ కిషన్‌పై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో అభినవ్ మనోహర్‌ను తీసుకొని.. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించవచ్చు.
రూ. 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి మ్యాచ్ సెంచరీ మినహా అతను ఒక్క ఇన్నింగ్స్‌లో రాణించలేదు. ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా స్మరన్ రవిచంద్రన్‌ను ఆడించే అవకాశం ఉంది.
గెలిస్తేనే..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఆడనుండగా.. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్ చెలరేగితేనే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తుంది. లేదంటే మరో పరాజయం తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
చెన్నైతో పోరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్/అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా
ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ చాహర్/ స్మరన్ రవిచంద్రన్.