Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అటు ఈటల.. ఇటు డేవిడ్ వార్నర్.. ఇద్దరూ బలి.. టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫైర్!

SRH fans brutally trolls for removing David Warner from captaincy

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో అటు బ్యాట్స్‌మెన్‌గా ఇటు కెప్టెన్‌గా విఫలమవుతున్న డేవిడ్ వార్నర్‌పై వేటు వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ.. జట్టు సారథ్య బాధ్యతలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు అప్పగించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌ నుంచి ఈ సీజన్‌ ముగిసే వరకు కేన్ మానే కెప్టెన్‌గా ఉంటాడని సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

అంతేకాకుండా తదుపరి మ్యాచ్‌లో ఓవర్‌సీస్ కాంబినేషన్ కూడా మారుతుందని, డేవిడ్ వార్నర్ తుది జట్టులో ఉండడని పరోక్షంగా పేర్కొంది. అయితే టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమ్‌మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

అన్యాయం..అత్యంత చెత్త నిర్ణయం..

ఒక్క సీజన్‌లో విఫలమైనంత మాత్రానా జట్టు కెప్టెన్‌పై వేటు వేయడం సమంజసం కాదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలహీనమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలందించాడని, చాంపియన్‌గా కూడా నిలబెట్టాడని అంత చేసిన డేవిడ్ వార్నర్‌ను ఇలా అగౌరవపరచడం ఏ మాత్రం బాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌సీబీని చూసి సిగ్గుతెచ్చుకోవాలని, ఆ జట్టు కెప్టెన్‌కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలని ఘాటుగా విమర్శిస్తున్నారు. జట్టుకు ఎంతో చేసిన డేవిడ్ వార్నర్‌ను గౌరవంగా తప్పించాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

అటు ఈటెల.. ఇటు డేవిడ్ వార్నర్..

ఇక తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు ముడిపెడుతూ మరికొందరూ కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలతో వేటుకు గురైన విషయం తెలిసిందే. ఆయన మంత్రి పదవి కోల్పోయిన విషయాన్ని డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ వేటుకి ముడిపెడుతున్నారు. ఓవైపు మంత్రిపై వేటు.. మరోవైపు కెప్టెన్ మార్పు ఏమైంది ఈ నగరానికి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈటల.. డేవిడ్ వార్నర్ కథ ఒకటేనని, టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈటల కష్టపడితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు‌కు వార్నర్ అంతే చేశాడని, కానీ ఇద్దరూ బలిపశువులయ్యారని ఈ ఇద్దరి కామన్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మనసులను నొప్పించావ్ కావ్య పాప..

ఇక సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్‌పై కూడా వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ్వుతూనే తమ మనసులను కష్టపెట్టావని కామెంట్ చేస్తున్నారు. ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ వేటు వేసే బదులు.. టీమ్‌ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, కోచ్‌లను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీవీఎస్ లక్ష్మణ్‌తో జట్టుకు.. తెలుగు రాష్ట్రాల యువ ఆటగాళ్లకు ఒరిగిందేం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకోకుండా నిద్రపోయి.. డేవిడ్ వార్నర్‌పై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి బలహీనమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును ఎవరూ నడిపించలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది అవమానించడమే..

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కు మంచి రికార్డుందని, 2015, 16, 17, 19, 20 సీజన్లలో అద్భుతంగా రాణించాడని ఆయా సీజన్ల తన బ్యాటింగ్ గణంకాలను షేర్ చేస్తున్నారు. 2016లో చాంపియన్‌గా నిలబెట్టిన విషయాన్ని ఫ్రాంచైజీ ఎలా మరిచిపోయిందని నిలదీస్తున్నారు. ఇక 2017, 19లో నాలుగు, 2020లో మూడు స్థానంలో నిలిచిందని గుర్తు చేస్తున్నారు. 2016 నుంచి ప్రతీ సీజన్‌లో 500కు పైగా పరుగులు చేశాడని, ఈ ఒక్క సీజన్‌లో విఫలమైనంత మాత్రాన ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీపై వేటు వేసి జట్టులో నుంచి తీసేయడం అవమానించడమేనని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, May 1, 2021, 17:06 [IST]
Other articles published on May 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+