న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson) తన వైఖరిని మార్చుకోవాలని వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) సూచించాడు. వన్డే ప్రపంచకప్ జట్టులోకి సంజూ శాంసన్‌ను తీసుకోకపోవడం సరైన నిర్ణయమేనని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. యాటిట్యూట్ చూపించకుండా క్రికెట్ పెద్దల మాట వింటూ, వారి సలహాలను పాటిస్తూ ఓపికగా ఆడితేనే సంజూ శాంసన్ టీమిండియాలో చోటు దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు.
వన్డే ప్రపంచకప్‌కు సంజూ శాంసన్(Sanju Samson)ను తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సౌతిండియన్ ఫ్యాన్స్.. సంజూ శాంసన్‌కు తగిన అవకాశాలు ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇతర ఆటగాళ్లలా వరుసగా అవకాశాలు ఇచ్చుంటే సక్సెస్ అయ్యేవాడని కామెంట్ చేస్తున్నారు.

తాజాగా సంజూ శాంసన్ సెలెక్షన్ వ్యవహారంపై స్పందించిన శ్రీశాంత్(Sreesanth).. అతని పట్ల వస్తున్న సానుభూతిపై అసహనం వ్యక్తం చేశాడు. 'ఒక ఆటగాడు తనను తాను అర్థం చేసుకోవడం కీలకం. సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, హర్షా భోగ్లేతో పాటు చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు సంజూ శాంసన్ ప్రతిభను గుర్తించారు. అద్భుత ఆటగాడని కితాబిచ్చారు.
అతని సామర్థ్యంపై ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ పిచ్‌కు అనుగుణంగా ఆడాలని సూచిస్తే మాత్రం అతను వినడు. ఈ వైఖరిని అతను మార్చుకోవాలి. సంజూ శాంసన్‌కు ఓ సాటి మలయాళీగా నేను చెప్పేది ఒక్కటే.. ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడకుండా వికెట్‌ను అర్థం చేసుకోని ఆడాలి. ఎవరి బౌలింగ్‌లోనైనా సంజూ ఆడుతాడనే విషయం అందరికి తెలుసు.
కానీ చూసుకోని ఆడితే అతనితో పాటు జట్టుకు మేలు జరుగుతోంది. సంజూకు సరైన అవకాశాలు రావడం లేదని అనడం సరికాదు. ఐర్లాండ్, శ్రీలంకతో అతనికి మంచి ఛాన్స్ వచ్చింది. పదేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. 2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్న సంజూ.. కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కానీ మూడు సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు.
అలాగే ఆటలో నిలకడ చూపించలేదు. సమయం ఎవరి కోసం ఆగదు. ప్రతిభ ఉన్న కొత్త ఆటగాళ్లు చాలా మంది వస్తున్నారు. త్వరలోనే సంజూ శాంసన్ (Sanju Samson)జట్టులోకి వస్తాడు. అపారమైన ప్రతిభ కలిగిన సంజూ ఐపీఎల్‌కే పరిమితమవ్వాలని నేను కోరుకోవడం లేదు.'అని శ్రీశాంత్ (Sreesanth) చెప్పుకొచ్చాడు.