
హైదరాబాద్: గాన గందర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో క్రీడాలోకం సంతాపం తెలిపింది. భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, అనిల్ కుంబ్లేతో పాటు ప్రస్తుత ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా ఎస్పీ బాలు కుటుంబానికి ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్సీ బాలు మరణ వార్త చాలా బాధను కలిగించిందని ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు దూరమైనా ఆయన పాటల్లో సజీవంగా ఉంటారన్నారు.
'పీడకలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తను తీవ్ర బాధను కలిగించింది. ఆయన సంగీతాన్ని ఇష్టపడ్డారు. సంగీతం ఆయనను తిరిగి ప్రేమించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'- రవిశాస్త్రి
'ఎస్పీ బాలు సర్ మరణవార్తతో నా గుండె బద్దలైంది. ఆయన భారత సినీమా దిగ్గజం. బాలుగారు దూరమైనా ఆయన పాటలు ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి. ఆయనతో నాకున్న స్నేహం, ఎస్పీగారికి క్రికెట్ పట్ల ఉన్నా ప్రేమ, చెన్నైలో మా సమావేశాలు ఎప్పటికీ మరిచిపోలేనివి. సుధాకర్, శైలాజా, చరణ్, మిగిలిన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మనస్పూర్తిక సంతాపం ప్రకటిస్తున్నా'-అనిల్ కుంబ్లే
'సంగీత దిగ్గజాలలో ఒకరైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్ స్వరం మరిచిపోలేనిది. అతనో అసాధారణమైన సింగర్. అతని కుటుంబానికి నా ప్రగాఢసానుభూతి.'-గౌతమ్ గంభీర్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు మీకు గుడ్‌బై చెప్పడం చాలా బాధగా ఉంది. ఆయన మనకు దూరమైనా.. పాటలతో మంచి లైబ్రరీ ఇచ్చి వెళ్లాడు.- హర్షా భోగ్లే
ఓరి దేవుడా!! ఈ ఏడాది ఇంత చెత్తగా దిగజారిపోతుంది! ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలి- రవిచంద్రన్ అశ్విన్
మీరు మా నుంచి దూరమైనా.. మీ పాటలో మాకు కనిపిస్తారు- విజయ్ శంకర్
'సాతియా తూనే క్యా కియా.. నా ఆల్‌టైమ్ ఫేవరేట్ సాంగ్. మీ పాటల్లో మీరు సజీవంగా ఉన్నారు సర్.. సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. మీ ఆత్మక శాంతి చేకూరాలి'- గుత్తా జ్వాల
కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన బాలు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది.