సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా స్పిన్ పిచ్‌లపై టీమిండియా బ్యాటర్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు టీమిండియాకు స్పిన్ ప్రధాన ఆయుదం. స్వదేశంలో స్పిన్ పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను చిత్తు చేసి.. ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్నర్లపై భారీగా పరుగులు చేసి విజయాలు అందుకునేది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు టీమిండియా బలమే బలహీనతగా మారింది.
మన స్పిన్ ఉచ్చు మనకే చుట్టుకుంటోంది. శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ ఓటమి.. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ పరాజయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. న్యూజిలాండ్‌తో స్పిన్ పిచ్‌లపై ఆడిన చివరి రెండు టెస్ట్‌ల్లో టీమిండియా 156, 245, 263, 121 పరుగులు మాత్రమే చేసింది. అంతేకాకుండా స్పిన్ బౌలింగ్‌లో 24.4 సగటుతో 37 వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్(66), వాషింగ్టన్ సుందర్(44.5) మినహా మిగతా బ్యాటర్లు స్పిన్‌కు తడబడ్డారు.

విరాట్ కోహ్లీ(16.75), రోహిత్ శర్మ(10.5) దారుణంగా విఫలమయ్యారు. ఒకప్పుడు సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు స్పిన్‌ను సమర్థవంతంగా ఆడేవారు. 2020 వరకు స్పిన్ బౌలింగ్‌లో టీమిండియాకు తిరుగులేదు. కానీ ఆ తర్వాతి నుంచి పరిస్థితి మారిపోయింది. అయితే దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే ఇందుకు కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
తీరిక లేని షెడ్యూల్ కారణంగా స్టార్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదని, దాంతోనే స్పిన్ బౌలింగ్ ఆడే సామర్థ్యం తగ్గిపోయిందంటున్నారు. రోహిత్ శర్మ చివరగా 2015లో, విరాట్ కోహ్లీ 2013లో రంజీ ట్రోఫీ ఆడారు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందని టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా వారిపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు.
వాస్తవానికి టీమిండియా టెస్ట్ సీజన్ ప్రారంభానికి ముందే భారత స్టార్ ఆటగాళ్లందరినీ దేశవాళీ క్రికెట్ ఆడించాలని హెడ్ కోచ్ గంభీర్ భావించాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఈ విషయాన్ని చెప్పి.. దులీప్ ట్రోఫీ ఆడించాలని సూచించాడు.
దులీప్ ట్రోఫీ ఆడాలని రోహిత్, కోహ్లీ, అశ్విన్‌ను అగార్కర్ అడిగితే ఆసక్తి లేదని చెప్పారని వార్తలు వచ్చాయి. 42 రోజుల విశ్రాంతిని స్టార్ ఆటగాళ్లు కుటుంబ సభ్యులతోనే గడిపారు. దులీప్ ట్రోఫీలో స్టార్ ఆటగాళ్లు ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడు కూడా టీమిండియా బ్యాటర్ల వైఫల్యానికి ప్రధాన కారణం. టీ20 ఫార్మాట్ ఎక్కువగా ఆడుతుండటంతోనే ఈ సమస్యకు ప్రధానంగా తెలుస్తోంది.