ప్చ్.. మళ్లీ ఓడిన భారత మహిళలు.. ఆఖరి బంతికి గెలిచిన సౌతాఫ్రికా!

లక్నో: కరోనాతో వచ్చిన సుదీర్ఘ విరామం.. భారత మహిళల క్రికెట్ టీమ్‌కు ఏది కలిసి రావడం లేదు. బౌలింగ్ వైఫల్యంతో వరుసగా రెండో సిరీస్‌ను కూడా చేజార్చుకున్నారు. సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత అమ్మాయిల చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. దాంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళలు 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించారు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ టీమ్ ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), రిచా ఘోష్ (26 బంతుల్లో 8 ఫోర్లతో 44) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ లిజెల్ లీ (45 బంతుల్లో 70; 11 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లౌరా వోల్వార్ట్ (39 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) చెలరేగారు.

9 రన్స్ కట్టడి చేయలేక..
ఆ జట్టు గెలిచేందుకు ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులిచ్చింది. కానీ ఐదో బంతిని అరుంధతి నోబాల్‌గా వేయడం... దక్షిణాఫ్రికాకు 3 పరుగులు రావడంతో ఆ జట్టు విజయసమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారింది. ఐదో బంతికి 2 పరుగులు చేసిన వోల్వార్ట్ ఆఖరి బంతికి మిగిలున్న ఒక్క పరుగును కూడా సాధించి జట్టును గెలిపించింది. గాయం నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ స్మృతి మంధాన సారథ్యం వహించింది. రేపు ఆఖరి టీ20 మ్యాచ్ జరుగుతుంది.

నిరాశ పరిచిన స్మృతి
తప్పక గెలిచి నిలవాల్సిన ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (7) తీవ్రంగా నిరాశపరిచింది. తొలి ఓవర్లో బౌండరీ బాదిన ఆమె ఎంతోసేపు నిలువలేదు. దీంతో 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హర్లీన్ డియోల్‌తో కలిసి షెఫాలీ ఇన్నింగ్స్‌ను నడిపించింది.
నాలుగో ఓవర్లో షెఫాలీ మూడు ఫోర్లు కొట్టింది. ఆరో ఓవర్లో బౌండరీతో పాటు లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదింది. మరోవైపు డియోల్ కూడా అడపాదడపా ఫోర్లు కొట్టడంతో ఓవర్‌కు 7 పరుగుల చొప్పున రన్‌రేట్ నమోదైంది. పది ఓవర్లు ముగిసే సరికి భారత్ 79/1 స్కోరు చేసింది. మరుసటి ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా మరో సిక్సర్ కొట్టిన షెఫాలీ అదే ఓవర్లో పెవిలియన్ చేరింది. తర్వాత జోరు తగ్గిన భారత్‌కు హర్లీన్ ( 4/31) రూపంలో మరో దెబ్బ తగిలింది.

రిచా జోరు..
ఈ దశలో క్రీజులోకి దిగిన రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిసింది. 14వ ఓవర్లో తన ఆటను బౌండరీలతో ప్రారంభించింది. ఆమె 3 ఫోర్లు, జెమిమా మరో బౌండరీ బాదడంతో లూస్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 18 పరుగులొచ్చాయి. ఇదే జోరును కొనసాగించడంతో స్కోరుబోర్డు జోరందుకుంది. ఓవర్‌కు ఒకటి, రెండు బౌండరీల చొప్పున ఆమె ధాటిగా ఆడింది. దీంతో భారత్ స్కోరు 150 పరుగులను అధిగమించింది.

లిజెల్ షో..
ఛేజింగ్‌లో రెండో ఓవర్లోనే ఓపెనర్ బాస్చ్ (2) వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టును లిజెల్ లీ మెరుపు ఇన్నింగ్స్ తో నిలబెట్టింది. కెప్టెన్ సునే లూస్ (21 బంతుల్లో 3 ఫోర్లతో 20 )తో రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించింది. తర్వాత వోల్వార్ట్‌తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ క్రమంలోనే లిజెల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడిన లిజెల్ చేయాల్సిన రన్‌రేట్‌ను దించేసింది. ఎట్టకేలకు ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రాధా యాదవ్ ఆమె సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు తెరదించింది. లిజెల్ అవుటైనా చివరి వరకు వోల్వార్ట్ క్రీజులో నిలిచి సౌతాఫ్రికాను గెలిపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications