South Africa vs Pakistan: తప్పు అంతా నాదే.. డీకాక్‌ది కాదు: ఫకర్ జమాన్

జోహనెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్ (193; 155 బంతుల్లో 18x4, 10x6) డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో వివాదాస్పద రీతిలో ఔటైన విషయం తెలిసిందే. దీనిపై జమాన్ స్పందిస్తూ.. అందులో తన తప్పే ఉందని, క్వింటన్ డికాక్ తప్పు ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. తాను నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న హరీస్ రవూఫ్ వైపు చూస్తున్నానని తెలిపాడు. మ్యాచ్ అనంతరం జమాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

రెండో రన్ తీయబోయి
బుధవారం పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. డికాక్ (80), కెప్టెన్ బవుమా (92), వాండర్ డసెన్ (60), మిల్లర్ (50) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో పాక్ 9 వికెట్ల నష్టానికి 324 స్కోర్ చేసి 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చివరి ఓవర్‌లో పాక్ 31 పరుగులు చేయాల్సిన స్థితిలో జమాన్ (192) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్‌లో హారిస్ రౌఫ్ (1) ఉన్నాడు. అయితే ఎంగిడి వేసిన తొలి బంతికి డబుల్ రన్ తీయబోయిన జమాన్ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో రనౌటయ్యాడు. ఫీల్డర్ మార్‌క్రమ్ డైరెక్ట్ త్రో విసరడంతో అతడు ఔటయ్యాడు. ఇక్కడే ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

డికాక్ సైగ
జమాన్ రెండో పరుగు కోసం క్రీజులోకి వస్తుండగా.. దక్షిణాఫ్రికా కీపర్ డికాక్ చేసిన ఓ సైగ వివాదాస్పదమైంది. ఫీల్డర్ బంతిని నాన్‌స్ట్రైకర్ వైపు విసురుతున్నట్లు చేయి ఊపడం, అప్పుడే జమాన్ అవతలి వైపు చూడటం, బంతి వికెట్లకు తాకడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. ఇదంతా తర్వాత రీప్లేలో కనిపించడంతో పాక్ అభిమానులు మండిపడుతున్నారు. డికాక్ ఉద్దేశపూర్వకంగా అలా చేశాడని, జమాన్ వన్డేల్లో రెండో ద్విశతకం సాధించకుండా చేశాడని మండిపడుతున్నారు. డికాక్ చేసింది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సైతం అన్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన జమాన్ తన రనౌట్ విషయంలో తప్పు తనదేనని ఒప్పుకున్నాడు.

అది నా తప్పే
'అది నా తప్పే. ఎందుకంటే.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో పరుగెడుతున్న హారిస్ రౌఫ్ క్రీజులో నుంచి కాస్త ఆలస్యంగా కదిలాడు. దీంతో నేను అతడి వైపు చూశాను. ఆ సమయంలో అతడు రనౌట్ అవుతాడేమోనని భావించా. ఇక తర్వాత ఏం జరిగినా మ్యాచ్ రిఫరీ చూసుకుంటాడు. కానీ అందులో డికాక్ తప్పేమీ లేదు. నేనీ మ్యాచ్‌లో చాలా అద్భుతంగా ఆడాను. కానీ మా జట్టు విజయం సాధించి ఉంటే ఇంకా బాగుండేది' అని ఫకర్ జమాన్ అన్నాడు.
గొప్ప రికార్డు:
ఫకర్ జమాన్ 193 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటైనా.. ఓ గొప్ప రికార్డు తన పేరుపై లికించుకున్నాడు. వన్డే ఛేదనల్లో తనదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా నమోదు చేశాడు. ఇదివరకు ఆసీస్ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ (185 నాటౌట్), టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (183 నాటౌట్), భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (183) ఆ ఘనత సాధించారు. ప్రస్తుతం చెరో విజయంతో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది.
IPL 2021: ప్లేయర్స్‌కు వ్యాక్సిన్లు వేయమని అడుగుతాం: బీసీసీఐ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications