భారత్ X పాక్ గొడవ.. సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు సమస్య!

బెంగళూరు: మారుతున్న కాలంతో పాటు క్రికెట్ కూడా కొత్తపుంతలు తొక్కింది. ఆటలో టెక్నాలజీ కీలకమైంది. డీఆర్‌ఎస్‌తో పాటు వీడియో విశ్లేషకులు ఆటలో భాగమయ్యారు. ప్రతి మ్యాచ్‌కు ముందు తమ జట్టుకు అవసరమైన విశ్లేషణలు అనలిస్ట్‌లు అందిస్తారు. ఎదుటి జట్టు బలాలు, బలహీనతలను అంచనా వేసి జట్టుకు అందించడమే కాకుండా, ఎలాంటి బంతులు వేస్తే బ్యాట్స్‌మెన్ తడబడతారు.
ఎటువంటి షాట్లు కొడితే బౌలర్లు నీరుగారిపోతారనే విషయాలను కూలంకషంగా పరిశీలించి ఒక నివేదిక ఇస్తారు. దీంతోపాటు పిచ్ రిపోర్ట్ టాస్ గెలిస్తే ఏం చేయాలి. ఓడిపోతే ఎలా ఆడాలనే వ్యూహాలు రచించడంలోనూ విశ్లేషకుల సూచనలే కీలకం అవుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఆటగాళ్లు మైదానంలో ఆడితే, విశ్లేషకుడు మైదానం బయట ఆడుతుంటాడు.

సౌతాఫ్రికాకు సమస్య..
అయితే ఇదంతా ఎందుకంటే.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా తయారైంది సౌతాఫ్రికా జట్టు పరిస్థితి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు ఆ జట్టుకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. భారత్‌కు చెందిన ప్రసన్న అగోరామ్ అనే వ్యక్తి సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నాడు. 11 ఏళ్లుగా క్రికెట్ అనలిస్టుగా పనిచేసిన ప్రసన్న.. సఫారీ టీమ్‌లో కీలక సభ్యుడు. స్వదేశంలో, విదేశాల్లో సఫారీలు ఎక్కడ ఆడినా వారి వెంట ప్రసన్న ఉండాల్సిందే. జట్టుకు అవసరమైన విశ్లేషణలు అందిస్తూ జట్టు గెలుపులో కీలక భాగస్వామిగా ఉన్నాడు.

వీసా నిరాకరణ..
అయితే, చాలా ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా జట్టు పాకిస్థాన్‌లో పర్యటనకు వెళ్లింది. జట్టులో ఉన్న సభ్యులందరికీ వీసా లభించింది. అయితే, భారతీయుడైన ప్రసన్నకు మాత్రం వీసా ఇవ్వడానికి నిరాకరించింది. భారత్-పాక్‌ల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ఇరు దేశాల మధ్య రాకపోకలు లేవు. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప వీసాలు మంజూరు చేయడం లేదు. దీంతో ప్రసన్న అగోరామ్‌కూ వీసా ఇవ్వలేదు.

వర్క్ ఫ్రమ్ హోమ్..
ప్రసన్నకు వీసా రాకపోవడంతో పాకిస్థాన్ పర్యటనను బెంగళూరు నుంచే పర్యవేక్షిస్తున్నాడు. తన ఇంటిలోనే మూడు ల్యాప్‌టాప్స్‌తో నిరంతరం జట్టుకు అవసరమైన నివేదికలు పంపుతున్నాడు. దశాబ్దానికి పైగా మైదానంలో జట్టు సభ్యులతో కలిసి విశ్లేషణలు చేసిన ప్రసన్న.. తొలిసారిగా జట్టుకు వందల కిలోమీటర్ల దూరం నుంచి పని చేస్తున్నాడు. అక్కడ సఫారీలు సాధన చేస్తున్న సమయంలోనే పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొన్న తీరుపై విశ్లేషణ చేసి సౌతాఫ్రికాకు అందిస్తున్నాడు.

విచిత్రమైన పరిస్థితి..
ఈ సందర్భంగా ప్రసన్నను జాతీయ మీడియా పలకరించింది. 'జట్టుకు దూరంగా పనిచేయడం అంటే చనిపోయిన మనిషితో సమానం. వాళ్లు ఎక్కడో ఆడుతుంటే ఇక్కడ నుంచి అనాలసిస్ పంపుతున్నాను. ఇది నా కెరీర్‌లో చాలా చిత్రమైన మలుపు. అయితే నా వరకు అత్యుత్తమైన విశ్లేషణలు అందించాలని ఎప్పుడూ భావిస్తాను'అని ప్రసన్న అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications