27 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఐసీసీ టైటిల్ నిర్వేదనకు ముగింపు లభించింది. ఐసీసీ టోర్నీ అనగానే పరాజయం తప్పా టైటిల్ ఎరుగని.. దురుదృష్టం తప్పా అదృష్టం ముఖం చూడని సౌతాఫ్రికాకు ఓ రోజొచ్చింది. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు తెరపడింది. బలమైన ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గెలవాలనే కసితో ఆడిన సఫారీ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఎయిడెన్ మార్క్‌రమ్ సెంచరీతో పాటు కెప్టెన్ బవుమా, బెడింగ్‌హమ్ విలువైన ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా శనివారం ముగిసిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 213/2 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. 83.4 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు చేసి గెలుపొందింది. ఓవర్‌నైట్ బ్యాటర్ టెంబా బవుమా(134 బంతుల్లో 5 ఫోర్లతో 66) ఒకే ఒక్క పరుగు జోడించి వెనుదిరిగినా.. ట్రిస్టన్ స్టబ్స్(43 బంతుల్లో 8) నిరాశపర్చినా.. డేవిడ్ బెడింగ్‌హమ్(49 బంతుల్లో ఫోర్‌తో 21 నాటౌట్)తో కలిసి మార్క్‌రమ్(207 బంతుల్లో 14 ఫోర్లతో 136) జట్టును విజయం ముంగింట నిలబెట్టాడు. చివర్లో మార్క్‌రమ్ ఔటైనా.. వెర్రెన్నే(4 నాటౌట్)తో కలిసి బెడింగ్‌హమ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్‌వుడ్ చెరో వికెట్ పడగొట్టారు.

1998 నాకౌట్ ట్రోఫీ విజయం తర్వాత సౌతాఫ్రికా గెలిచిన మరో ఐసీసీ టైటిల్ ఇదే కావడం విశేషం. క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికాకు ఇది రెండో ఐసీసీ టైటిల్ మాత్రమే. ప్రతీ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో నాకౌట్ చేరడం.. కీలక మ్యాచ్‌లో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించడం సౌతాఫ్రికాకు అలవాటుగా మారింది. ఒకటా రెండా.. వన్డే ప్రపంచకప్‌లో 7 సార్లు.. టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు సార్లు సౌతాఫ్రికా ఖంగుతిన్నది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ భారత్ చేతిలో సౌతాఫ్రికాకు నిరాశే ఎదురైంది. ఈ సారి మాత్రం ఆ తప్పు చేయకుండా సఫారీ టీమ్ టైటిల్‌ను ఒడిసిపట్టుకుంది. తమపై ఉన్న చోకర్స్ అనే ముద్రను చెరపేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. స్మిత్(66), బ్యూ వెబ్‌స్టర్(72) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రబడా(5/51) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ బెడింగ్‌హమ్(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్యాట్ కమిన్స్(6/28) సఫారీ పతనాన్ని శాసించింది. 74 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 207 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్(58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. కగిసో రబడా(4/59) నాలుగు వికెట్లు తీసాడు. 282 పరుగుల లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. మార్క్‌మర్ సెంచరీ, టెంబా బవుమా హాఫ్ సెంచరీతో లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా ఆటగాళ్లంతా కన్నీటి పర్యంతమయ్యారు.