
న్యూఢిల్లీ: ఓ వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ సన్నాహకాలు వేగంగా సాగుతున్నా.. మరోవైపు బరిలోకి దిగే విదేశీ ఆటగాళ్లపై మాత్రం అనేక సందేహాలు నెలకొన్నాయి. వన్డే సిరీస్ కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు వారం రోజులు లేటుగా వస్తారని తెలుస్తోంది. అలాగే కరోనా ఆంక్షల నేపథ్యంలో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనడం కష్టమేనని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడా సందేహాలన్ని తొలిగిపోయాయి. తాజాగా సౌతాఫ్రికా ప్రభుత్వం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్‌కు క్లియరెన్స్ ఇవ్వడంతో ప్లేయర్లకు మార్గం సుగుమమైంది.
ఐపీఎల్‌తో పాటు సీపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లకు కూడా ప్రభుత్వ నిర్ణయం కలిసొచ్చింది. ఆటగాళ్లంతా తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక సౌతాఫ్రికా బోర్డు కూడా వీళ్లకు నో అబ్జెక్షన్ సర్టిపికేట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఫాఫ్ డుప్లెసిస్, లుంగీ ఎంగిడి తమ టీమ్‌తో కలుస్తారని చెన్నై సూపర్ కింగ్స్ తెలిపింది. 'మా ఆటగాళ్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నాం. ప్రయాణానికి కావాల్సిన అన్ని అనుమతులు లభించాయని వారు తెలిపారు. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా వారి ప్రయాణానికి సిద్దమవుతున్నారు. ఫాఫ్ డూప్లెసిస్, ఎంగిడి సెప్టెంబర్ 1న దుబాయ్‌కి చేరుకుంటారు'అని ఓ సీఎస్‌కే అధికారి తెలిపారు. ఇక మూడో ఆటగాడైన ఇమ్రాన తాహిర్ సీపీఎల్ 2020లో భాగంగా ట్రినిడాడ్‌లో ఉన్నాడు. ఆ లీగ్ అనంతరం నేరుగా జట్టుతో కలవనున్నాడు.
మిగతా ప్లేయర్లు కూడా రెండు రోజులు అటు ఇటుగా తమ ఫ్రాంచైజీలతో కలవనున్నారు. మొత్తం 10 మంది సఫారీ ప్లేయర్లు లీగ్‌కు అందుబాటులో ఉండనున్నారు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. ఆ జట్టులో కీలక ఆటగాళ్లైన ఏబీ డివిలియర్స్, క్రిస్ మొర్రిస్, డేల్ స్టెయిన్ అందుబాటులోకి రానున్నారు. ఇక సుదీర్ఘకాలంగా ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ లీగ్ కావాల్సిన అన్ని అనుమతులు రాగా.. షెడ్యూల్ ప్రకటించడం, జట్లు దుబాయ్ చేరడం మిగిలిపోయాయి. ఆగస్టు 20 తర్వాత ఫ్రాంచైజీలన్నీ యూఏఈకి వెళ్లనున్నాయి.