టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం హార్దిక్ పాండ్యానేనని తెలిపాడు. జస్‌ప్రీత్ బుమ్రా కంటే హార్దిక్ పాండ్యానే ఎక్కువ ప్రభావం చూపాడని చెప్పుకొచ్చాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన షుక్రి కాన్రాడ్.. హార్దిక్ పాండ్యా వరల్డ్ బెస్ట్ ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వాలని కూడా అభిప్రాయపడ్డాడు.

'నిజాయితీగా చెప్పాలంటే జస్‌ప్రీత్ బుమ్రా కంటే హార్దిక్ పాండ్యానే ఈ సిరీస్‌లో ఎక్కువ ప్రభావం చూపాడు. బుమ్రా ప్రతిభను తక్కువ చేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. కానీ ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం హార్దిక్ పాండ్యా. ఈ రాత్రి అతను ఆడిన ఇన్నింగ్సే మా విజయవకాశాలను దెబ్బతీసింది. తొలి మ్యాచ్‌లో కూడా భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు అతను వచ్చి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఫార్మాట్‌లోనే అత్యుత్తమ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒకడు అనడానికి ఈ సిరీసే నిదర్శనం. అతని ప్రదర్శన టాప్‌లో ఉంది. ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరో నాకు ఇంకా తెలియదు కానీ, అది అతనే కాకపోతే నేను చాలా ఆశ్చర్యపోతాను. కాబట్టి, రెండు జట్ల మధ్య అతనే అతిపెద్ద తేడా'అని షుక్రి కాన్రాడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 73), హార్దిక్ పాండ్యా(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్‌మన్, జార్జ్ లిండే తలో వికెట్ తీసారు.
అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. క్వింటన్ డికాక్(35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(4/53) నాలుగు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా..అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసాడు. జస్‌ప్రీత్ బుమ్రా(2/17) రెండు వికెట్లు పడగొట్టాడు.