సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఆసీస్ కోల్పోయింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 84 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో మాథ్యూ బ్రిట్జ్‌కే, ట్రిస్టన్ స్టబ్స్ రాణించగా.. బౌలింగ్‌లో లుంగి ఎంగిడి ఆసీస్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్‌కే(78 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88), ట్రిస్టన్ స్టబ్స్(87 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 74)హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా(3/63) మూడు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్(2/46), మార్నస్ లబుషేన్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. జోష్ ఇంగ్లీస్(74 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(5/42) ఐదు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/23), సేనరన్ ముత్తుసామీ(2/30) రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి వన్డేలోనూ ఆసీస్ 84 పరుగులతో చిత్తయ్యింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది.