జమ్మూ కశ్మీర్ యువపేసర్ ఆకిబ్ నబీపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. రంజీ ట్రోఫీలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఈ కుర్రాడిని టీమిండియాలోకి తీసుకోవాలని, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు సూచించాడు.
ఈ సీజన్ రంజీ ట్రోఫీ 2025-26లో ఆకీబ్ నబీ 60 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లోనూ ఐదు వికెట్ల(5/54)తో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో 60 ప్లస్ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నబీ నిలిచాడు. నబీ బౌలింగ్ ప్రదర్శనకు ఫిదా అయిన సౌరవ్ గంగూలీ.. ఎక్స్‌వేదికగా అతన్ని కొనియాడాడు. టీమిండియా టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు సూచించాడు.

'పట్టుదల, కృషి ఉంటే ఏం చేయవచ్చో జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి చూపించింది. వారు ఆ ప్రాంతం గర్వపడేలా చేశారు. కష్టతరమైన వాతావరణం మనుషులను దృఢంగా మారుస్తుంది. ఆకిబ్ నబీ జాతీయ జట్టు జెర్సీని ధరించే దిశగా సాగుతున్నాడు. ఈ వేసవిలో ఇంగ్లండ్ పర్యటన అతని సరైన వేదిక.'అని ట్వీట్ చేసిన దాదా.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఈ పోస్ట్‌కు ట్యాగ్ చేశాడు.
జమ్మూ కశ్మీర్ చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది. 67 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూ కశ్మీర్ టైటిల్ దిశగా సాగుతోంది.హుబ్లి వేదికగా జరుగుతున్న ఫైనల్లో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ 584 పరుగులు భారీ స్కోర్ చేసింది. శుభమ్ పుండిర్(121) సెంచరీతో రాణించగా.. యవెర్ హసన్(88), కెప్టెన్ పరాస్ డొగ్రా(70), అబ్దుల్ సమద్(61), వధావన్(70), సాహిల్ లోత్రా(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(5/99) ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం కర్ణాటక 93.3 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(266 బంతుల్లో 21 ఫోర్లతో 160) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆకీబ్ నబీ(5/54) ఐదు వికెట్లు తీయగా.. సునీల్ కుమార్(2/51), యుధ్వీర్ సింగ్(2/55) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులు చేసింది. శనివారం ఈ మ్యాచ్‌కు ఆఖరి రోజు. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జమ్మూ కశ్మీర్‌ను విజేతగా ప్రకటిస్తారు.