భారత క్రికెట్‌లో అపారమైన ప్రతిభ ఉందని, ఏ ఒక్కరి కోసమో అది ఆగదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా అద్భుతంగా రాణించిందని కొనియాడాడు. కోహ్లీ వెళ్లగానే యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు జట్టు కోసం నిలబడ్డారని చెప్పాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. ఈ పర్యటనకు ముందే టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఈ సందేహాలను పటా పంచలు చేస్తూ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చింది. దాంతో టీమిండియాలో కొత్త శకం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమైంది.

తాజాగా ఈ విషయంపై మాట్లాడిన గంగూలీ.. భారత క్రికెట్‌కు పటిష్టమైన దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఉందని, ఎవరూ లేకున్నా అది ఆగదని తెలిపాడు. 'భారత క్రికెట్ ఏ ఒక్కరి కోసమో ఆగదు. ఇక్కడ చాలా ప్రతిభ ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత అద్భుత ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. భారత క్రికెట్ అంటే ఇదే. సునీల్ గవాస్కర్ రిటైరయ్యాక సచిన్ టెండూల్కర్ వచ్చాడు.
రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ కూడా జత కలిశారు. వారు వెళ్లగానే కోహ్లీ వెలుగులోకి వచ్చాడు. కోహ్లీ తర్వాత యశస్వి, రిషభ్, గిల్ సత్తా చాటుతున్నారు. భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవలేదు. ఆటగాళ్లు వస్తూనే ఉంటారు. పోతూనే ఉంటారు. అద్భుతమైన దేశవాళీ వ్యవస్థ భారత క్రికెట్‌కు బలంగా ఉంది. ఐపీఎల్ అలాంటి వేదికే. భారత్-ఏ జట్టు, అండర్ 19 టీమ్స్ కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ గొప్పగా ఆడింది. శుభ్‌మన్ గిల్, గౌతమ్ గంభీర్‌కు అభినందనలు. 2002, 2007 తర్వాత ఇంగ్లండ్‌లో భారత్ టాప్-6 బ్యాటర్లు నిలకడగా రాణించడం ఇదే తొలిసారి.' గంగూలీ పేర్కొన్నాడు.