టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముక్కుసూటి మనిషని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. టీమిండియా కోచ్‌గా గంభీర్ రాణిస్తున్నాడని కొనియాడాడు. తనకు కూడా టీమిండియా కోచ్‌గా పనిచేయాలనుందని మనసులోని కోరికను బయటపెట్టాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. సీఎం పదవి ఇచ్చినా రాజకీయాల్లోకి వెళ్లనని స్పష్టం చేశాడు.
'అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత నేను విభిన్న పాత్రలను పోషించాను. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా.. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాను. దాంతో కోచ్‌గా పనిచేసేందుకు నాకు సమయం దొరకలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం నా వయసు 50 ఏళ్లు మాత్రమే. కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఏం జరుగుతుందో చూడాలి.

గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాణిస్తున్నాడు. అతను తన ప్రయాణాన్ని నెమ్మదిగా ప్రారంభించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ల్లో పరాజయాలను ఎదుర్కొన్నాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ అతని కోచింగ్‌కు కీలకం కానుంది. గంభీర్‌తో నాకు అంతగా చనువు లేదు. కానీ ఆట పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి. అతని వ్యూహాలను కూడా నేను దగ్గరగా చూడలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అతనితో నేను పనిచేయలేదు. అతనితో కలిసి ఆడాను.
గంభీర్ గొప్ప ఆటగాడు. మేం కలిసి ఆడేటప్పుడు అతను నాకు చాలా గౌరవం ఇచ్చేవాడు. సీనియర్ల పట్ల మర్యాదగా ఉండేవాడు. ప్రస్తుతం కోచ్‌గా అతను చాలా కసితో ఉన్నాడు. అతను ముక్కుసూటి మనిషి. ఏదైనా ముఖం మీదే చెప్పేస్తాడు. అతను కోచ్‌గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అయితే అందరిలానే అతను కూడా ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు. అతనికి కాస్త సమయం ఇవ్వాలి'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
సౌరవ్ గంగూలీ.. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు. అతని పర్యవేక్షణలోని ఢిల్లీ మహిళల టీమ్ ఫైనల్ చేరి ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైంది. రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి తనకు లేదని గంగూలీ స్పష్టం చేశాడు. సీఎం పదవి ఇచ్చినా.. రాజకీయాల్లోకి వెళ్లనని తెలిపాడు.