టీమిండియా కోచ్ పదవికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేసుకొని ఉంటే.. అతను అద్భుతమైన కోచ్‌గా నిలుస్తాడని కొనియాడాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది.
ఈ క్రమంలోనే బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది. అయితే టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తయిందని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు గంభీర్ మాత్రం.. తాను కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మెంటార్‌గానే కొనసాగుతానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

కేకేఆర్‌ను సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. దాంతో టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఎవరా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. కొత్త హెడ్ కోచ్ పదవికి దరఖాస్తుల గడువు మే 27నే ముగియగా.. గంభీర్ అప్లే చేసుకున్నాడా? లేదా? అనేదానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టే అవకాశాలపై సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'టీమిండియా హెడ్ కోచ్‌గా భారతీయుడే ఉండాలనే వాదనకు నేను అనుకూలంగా ఉంటాను. ఎందుకంటే మన దేశంలో ప్రతిభావంతమైన కోచ్‌లు ఎందరో ఉన్నారు. తమ ఆటతో భారత్ క్రికెట్‌లో అద్భుతాలు చేసిన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు మళ్లీ జట్టులో భాగమవ్వడం భారత క్రికెట్‌కే మంచిది.
భారత్ కోచ్‌గా గంభీర్ ఎంపికైతే అతను అత్యుత్తమ కోచ్‌గా నిలుస్తాడు. అయితే అతను టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడా? లేదా? అనే విషయం నాకు తెలియదు. దరఖాస్తు చేసుకుంటేనే అతను టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికవుతాడు. దరఖాస్తుకు తుది గడువు మే 27నే ముగిసిందనుకుంటా. కావాలనుకుంటే బీసీసీఐ ఈ గడువును పెంచవచ్చు.
టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు గంభీర్ సుముఖంగా ఉంటే అతను అత్యుత్తమ కోచ్‌గా మారుతాడు. ఆటపై గంభీర్‌కు ఉన్న పిచ్చి నాకు బాగా తెలుసు. ఈ ఏడాది కేకేఆర్ తరఫున అతని పనితీరును మనమంతా చూశాం. ఆటపై అతనికి ఉన్న మక్కువ, కసిని అందరూ చూశారు. బీసీసీఐ అతనికి టీమిండియా హెడ్ కోచ్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంటే అతనే సరైనోడు.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications