
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పదవీకాలం ముగిసింది. బోర్డు చీఫ్‌గా గత అక్టోబరులో ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ.. పరిపాలనవేత్తగా సోమవారంతో ఆరు సంవత్సరాల పదవీకాలం పూర్తయ్యింది. గతంలో అతడు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. బోర్డు కొత్త రాజ్యాంగం ప్రకారం అటు రాష్ట్ర సంఘంలోగానీ ఇటు బీసీసీఐలో గానీ వరుసగా ఆరేళ్లు పదవిలో ఉంటే.. మూడేళ్లు విరామం తీసుకోవాలి. దీంతో ఇప్పుడు గంగూలీ ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
దాదా బోర్డు కార్యకలపాలకు దూరంగా ఉంటాడా? లేదా బోర్డు కార్యదర్శి జైషా మాదిరిగా పదవిలో కొనసాగుతాడా? చూడాల్సి ఉంది. జైషా పదవి కాలం మే నెలలోనే ముగిసింది. అయినా నేటికీ బోర్డులో కీలకంగా ఉన్నాడు. లోథా కమిటీ సూచనల మేరకు ఈ ఆరేళ్ల పదవీ కాలం నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు. గంగూలీ, షాల కోసం ఈ నిబంధనను సవరించాలని బీసీసీఐ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. వచ్చే నెల 17న ధర్మాసం బోర్డు అప్పీలుపై విచారణ జరపనుంది. అప్పుడే గంగూలీ భవిష్యత్తుపై క్లారిటీ రానుంది. అయితే మరికొంత కాలం బీసీసీఐ బాస్‌గా దాదానే కొనసాగాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
అయితే ఐసీసీ ఛైర్మన్ పదవి రేసులో దాదా పేరు వినిపిస్తుంది. మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, గ్రేమ్ స్మిత్ వంటి ఆటగాళ్లు కూడా ఐసీసీ బాస్‌గా గంగూలీనే సరైనవాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దాదా మాత్రం ఆ పదవి చేపెట్టేందుకు తొందరేం లేదని, జీవితంలో ఒకేసారి చేపట్టే హోదాలని తెలిపాడు. ఈ నేపథ్యంలో గంగూలీ భవితవ్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.