ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేయడం చాలా ముఖ్యమని, 170, 180 పరుగులు చేస్తే విజయాలు దక్కవన్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే.
సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ విజయంతో సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ పరాజయం నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ఘోర పరాజయంపై స్పందించిన గంగూలీ.. ఈ ఓటమికి ఏ ఒక్కరినో నిందించలేమన్నాడు.

'బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. టెస్ట్ క్రికెట్‌లో విజయాలు సాధించాలంటే బ్యాటింగ్ బాగా చేయాలి. ఎక్కువ పరుగులు నమోదు చేయాలి. 170, 180 పరుగులు చేస్తే విజయాలు దక్కవు. టీమిండియా 350-400 పరుగులు చేయాలి. ఈ పరాజయానికి ఏ ఒక్కరినో నిందించలేం.
బ్యాటర్లంతా సమష్టిగా విఫలమయ్యారు. అందరూ రన్స్ చేయాల్సిందే. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. త్వరలోనే తన బలహీతను అధిగమించి ఫామ్ అందుకుంటాడు. చివరి టెస్ట్‌కు దూరంగా ఉండటం రోహిత్ శర్మ వ్యక్తిగత నిర్ణయం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు.'అని గంగూలీ పేర్కొన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో ఓ సెంచరీ సాయంతో 190 పరుగులు చేయగా.. రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో స్టార్ సంస్కృతికి తెరదించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.