వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక మారింది.. ఎక్కడంటే..?

దుబాయ్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదిక మారింది. గతంలో షెడ్యూల్ చేసిన ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియంలో కాకుండా సౌతాంప్టన్‌లో మ్యాచ్ జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సోమవారం స్పష్టం చేశాడు. జూన్ 18 నుంచి 22 మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కేంద్రమైన లార్డ్స్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అయితే ఇంగ్లండ్‌లో తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఇంగ్లండ్‌లో జరపాల్సి ఉండటంతో సౌతాంప్టన్‌కు మ్యాచ్‌ను తరలించారు. ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో ఇరు జట్లు తుది పోరులో తలపడతాయి.

ఐపీఎల్ ముగిసిన వెంటనే..
స్టేడియం లోపలి భాగంలోనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉండటంతో 'బయో బబుల్' ఏర్పాటు చేసేందుకు ఇది సరైన చోటుగా ఐసీసీ భావించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తాను మ్యాచ్ చూసేందుకు వెళ్లనున్నట్లు కూడా అతను వెల్లడించాడు.
'వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు నేను వెళుతున్నాను. విరాట్ కోహ్లీ సారథ్యంలోని మన జట్టు విలియమ్సన్ కెప్టెన్సీలోని కివీస్‌ను ఓడించగలదనే నమ్మకముంది. మనకంటే ముందే అక్కడికి చేరే న్యూజిలాండ్ రెండు టెస్టులు కూడా ఆడుతుంది' అని గంగూలీ స్పష్టం చేశాడు. మే 30న ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళుతుంది. ఐసీసీ ఇప్పటికే సదరు హోటల్ మొత్తాన్ని జూన్ 1 నుంచి 26 వరకు బుక్ చేసేసింది. అక్కడే టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పాటించాల్సి ఉంటుంది.

సిరీస్ విజయం అతిపెద్ద ఘనత..
భారత జట్టు ఇటీవల సాధించిన విజయాల పట్ల గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. కెప్టెన్లుగా రహానే, కోహ్లీ పనితీరును అభినందించాడు. యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. 'సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ ఇలాం టి ఫలితాలు సాధించడం నిజంగా అద్భుతం. ఈ ఫలితాలను అస్సలు ఊహించలేదు. ప్రతి రోజు ఓ కొత్తరకమైన క్రికెట్‌ను చూపెట్టారు. ఇది మర్చిపోలేని అనుభూతి. బ్రిస్బేన్‌లో విజయం గురించి ఎంత చెప్పినా తక్కు వే. బుమ్రా లేకుండా ఆ మ్యాచ్ గెలిచాం. ఐపీఎల్ నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు ప్లేయర్ల అచీవ్‌మెంట్ ఫెంటాస్టిక్. హెడ్ కచ్, సపోర్ట్ స్టాఫ్, ప్రతి ఒక్కర్ని అభినందించాల్సిందే. 'అని దాదా పేర్కొన్నాడు.

పంత్ మ్యాచ్ విన్నర్
యువ హిట్టర్ రిషభ్ పంత్ మ్యాచ్ విన్నర్ అని సౌరవ్ ప్రశంసించాడు. 'నా దృష్టి లో సెహ్వాగ్, యువరాజ్, ధోనీ తరహాలో ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా పంత్‌లోనూ ఉంది. అతనో మ్యాచ్ విన్నర్. తనదైన రోజున మ్యాచ్ గెలిపిస్తాడు. మొతెరాలో తీవ్ర ఒత్తిడిలో అతను చేసిన సెంచరీ అద్భుతం. కౌంటర్ అటాకింగ్ గేమ్ బాగుంది. కుర్రాళ్లను తీర్చిదిద్దడంలో ద్రవిడ్ పాత్ర మరవలేనిది. రిజర్వ్ బెంచ్‌ను బలంగా ఉందంటే దానికి ద్రవిడే కారణం.' అని గంగూలీ కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications