టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని గణంకాలే సెహ్వాగ్ ఎంతటి డేంజరస్ బ్యాటర్ అనే విషయాన్ని తెలియజేస్తాయి. కానీ సెహ్వాగ్ తన బ్యాటింగ్ శైలితో కోచ్‌లకు, కెప్టెన్లకు బీపీని పెంచేవాడు. ర్యాంప్ షాట్స్‌తో వికెట్ పారేసుకోవడంతో పాటు కాలు కదపకుండా బ్యాటింగ్ చేసేవాడు. ఇది కోచ్‌లకు తెగ కోపం తెప్పించేది.
ఫుట్‌వర్క్ విషయంలో గ్రెగ్ చాపెల్‌తో తనకు తీవ్ర వాగ్వాదం జరిగిందని ఇటీవలే సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సరిగ్గా ఆడకపోతే జట్టులో నుంచి కూడా తీసేస్తానని హెచ్చరించాడని, కానీ తాను అద్భుత బ్యాటింగ్ చేసి చాపెల్ నోరు మూయించానని గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా కోచ్‌ను తనకు దూరంగా ఉండమని, అప్పటి కెప్టెన్ ద్రవిడ్‌కు చెప్పానని కూడా తెలిపాడు. గ్రెగ్ ఛాపెల్ కాదు.. జాన్ రైట్ కూడా సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి నచ్చక గొడవపడ్డాడు.
చొక్కాపట్టి మరి సెహ్వాగ్‌ను జాన్ రైట్ కొట్టాడని అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓ కార్యక్రమంలో తెలిపాడు. జాన్ రైట్ సైతం ఇండియన్ సమ్మర్ అనే పుస్తకంలో ఈ ఘటనను ప్రస్తావించాడు. అంతేకాకుండా అప్పటి టీమిండియా మేనేజర్ రాజీవ్ శుక్లా సైతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

ఇంగ్లండ్ గడ్డపై శ్రీలంక, భారత్ మధ్య జరిగిన ముక్కోణపు నాట్‌వెస్ట్ సిరీస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సెహ్వాగ్ ఆ సిరీస్‌లో అనవసర షాట్స్‌తో వికెట్ పారేసుకున్నాడు. దాంతో అప్పటి కోచ్ జాన్ రైట్.. సెహ్వాగ్‌ను మందలిస్తూ ర్యాంప్ షాట్స్ ఆడవద్దని సూచించాడు. జాన్ రైట్ మాటలను పట్టించుకోని సెహ్వాగ్.. ఆ సిరీస్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో పిచ్చి షాట్ ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో కోపంతో ఊగిపోయిన జాన్ రైట్.. సెహ్వాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే కాలర్ పట్టి చేయి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 188 పరుగుల లక్ష్యాన్ని చేదించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సౌరవ్ గంగూలీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగా.. ఆటగాళ్లంతా సంబరాలు చేసుకోకుండా నిశబ్దంగా కనిపించారు. వెంటనే గంగూలీ ఏం జరిగిందని అప్పటి సీనియర్ ప్లేయర్ కుంబ్లేను అడగ్గా.. సెహ్వాగ్‌ను కోచ్ కొట్టాడని చెప్పాడట.
మౌనంగా ఉన్న గంగూలీ.. బస్‌లో హోటల్‌కు వెళ్లే సమయంలో జాన్ రైట్‌ను ఈ ఘటన గురించి అడగ్గా..'అవును నిజమే.. చేయి చేసుకున్నాను. ఎంత చెప్పినా వినకుండా పిచ్చి షాట్ ఆడి ఔటయ్యాడు. అది నాకు కోపం తెప్పించింది. దాంతోనే చేయి చేసుకున్నాను. ఓ గురువుగా అతను పదే పదే ఒకే తప్పిదం చేయడం తట్టుకోలేకపోయాను.'అని జాన్ రైట్ బదులిచ్చాడట. వెంటనే గంగూలీ.. సెహ్వాగ్ తిరిగి కొట్టాడా? అని ప్రశ్నించగా.. అందుకు జాన్ రైట్.. లేదు.. మౌనంగా వెళ్లిపోయాడని చెప్పాడట.
ఆ తర్వాత గంగూలీ సెహ్వాగ్‌ను అడగ్గా.. 'నాదే తప్పు. చెత్త షాట్ ఆడకుండా ఉండాల్సింది. ఆయన చెప్పినా వినలేదు. అందుకే కొట్టాడు. కోచ్ తప్పులేదు.'అని సెహ్వాగ్ సమాధానమిచ్చాడని గంగూలీ తెలిపాడు.హోటల్‌కు చేరుకున్న తర్వాత ఈ విషయంపై సచిన్ రూమ్‌కెళ్లి మాట్లాడితే.. 'అవును గొడవ జరిగింది. ఇది ఓ గొప్ప టీమ్. ఇంత పెద్ద గొడవ జరిగినా.. ఎలాంటి సమస్య లేకుండా సద్దుమణిగింది.'అని సచిన్ చెప్పాడని గంగూలీ గుర్తు చేసుకున్నాడు.
అప్పటి టీమ్ మేనేజర్ రాజీవ్ శుక్లా మాత్రం కోచ్ జాన్‌రైట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశానని వెల్లడించాడు. ఆటగాళ్లను కొట్టడం సరికాదని, వెళ్లి సెహ్వాగ్‌కు సారీ చెప్పాలని కూడా సలహా ఇచ్చానని రాజీవ్ శుక్లా తెలిపాడు. కానీ సచిన్ అడ్డుకున్నాడని, సారీ చెబితే ఆటగాళ్ల ముందు కోచ్ విలువ తగ్గుతుందని, తాను సెహ్వాగ్‌తో మాట్లాడుతానని తనను కన్విన్స్ చేశాడని రాజీవ్ శుక్లా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ కూడా లైట్ తీస్కోవడంతో ఏలాంటి సమస్య లేకుండా ఈ గొడవ ముగిసింది. సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి.. కోచ్‌లు, కెప్టెన్లకు కోపం తెప్పించినా..అభిమానులను మాత్రం ఆకట్టుకునేది. సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ ముంగిట సిక్స్‌లు బాదిన ఏకైక క్రికెటర్ సెహ్వాగ్. అతని ఫియర్‌లెస్ గేమ్‌కు స్పెషల్ క్రేజ్ ఉంది.