టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని ఎందుకు ఆడించడం లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశ్నించాడు. షమీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, అతనికి మూడు ఫార్మాట్లు ఆడే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. రంజీ ట్రోఫీలోనూ రెండు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడని, అయినా అతన్ని టెస్ట్ టీమ్‌లోకి తీసుకోకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన మహమ్మద్ షమీ.. ఫిట్‌నెస్ సమస్యలతో భారత జట్టుకు దూరమయ్యాడు.
ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. సెలెక్టర్ల తీరుపై మహమ్మద్ షమీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వయసు మీద పడటంతోనే షమీని సెలెక్టర్లు పట్టించుకోవడం లేదనే విషయం అర్థమవుతుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ.. షమీని భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ధ్రువ్ జురెల్‌ను తుది జట్టులో ఆడించాలని సూచించాడు.

'రంజీ ట్రోఫీలో మహమ్మద్ షమీ బౌలింగ్ చూశాను. అతను ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒంటి చేత్తో బెంగాల్‌ను గెలిపించాడు. రెండు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అతని ప్రదర్శనను సెలెక్టర్లు చూశారనే అనుకుంటున్నా. సెలెక్టర్లు షమీతో సంప్రదింపులు జరుపుతున్నారని భావిస్తున్నా. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్, ఫిట్‌నెస్ చూస్తే భారత్‌కు అన్ని ఫార్మాట్లలో ఆడగలడు. ముఖ్యంగా షమీని టెస్ట్‌ల్లో ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు.
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ధ్రువ్ జురెల్‌ను తుది జట్టులో ఆడించాలి. గాయం నుంచి రిషభ్ పంత్ కూడా కోలుకున్నాడు. అతను రీఎంట్రీ ఇవ్వడం ఖాయం. కానీ సూపర్ ఫామ్‌లో ఉన్న జురెల్‌కు కూడా అవకాశాం కల్పించాలి. సాయి సుదర్శన్‌ను తప్పించి జురెల్‌ను ఆడించాలి.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో అనధికార టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ సెంచరీలు సాధించాడు.
రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు కోల్‌కతా చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కుర్రాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినట్లు వార్తలు వచ్చాయి.