న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ ఉన్నప్పుడే కోహ్లీ తన సారథ్యాన్ని కోల్పోయాడు. ఉద్దేశపూర్వకంగానే గంగూలీ తనను తప్పించాడని కోహ్లీ భావించాడు. ఈ విషయాన్ని పలు మార్లు పరోక్షంగా బయట పెట్టాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ ఒకరికొకరు ఎదురుపడినా.. కనీసం మందలించుకోలేదు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అయితే ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆడిన చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో కోహ్లీ వరుస సెంచరీలు బాదాడు. సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో పాటు గుజరాత్ టైటాన్స్‌లపై శతకాలు అందుకున్నాడు.

ఇక శుభ్‌మన్ గిల్ కూడా వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లీలానే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీపై శతకాలు అందుకున్నాడు. ఇక శుభ్‌మన్ గిల్ సాధించిన సెంచరీలను సౌరవ్ గంగూలీ సోషల్ మీడియా వేదికగా కొనియాడాడు.
'ఈ దేశం ఎంత టాలెంట్‌ను అందిస్తుందో చూడండి. శుభ్‌మన్ గిల్.. అద్భుతం. రెండు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడావు. ఐపీఎల్‌లో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో అనేదానికి ఈ సెంచరీలు నిదర్శనం'అని ట్వీట్ చేశాడు. అయితే కోహ్లీని ప్రశంసించకుండా శుభ్‌మన్ గిల్‌ను ఒక్కడినే కొనియాడటాన్ని అభిమానులు తప్పుబట్టారు.
దాదాపై ట్రోలింగ్‌కు దిగారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఇది తగదని, కోహ్లీతో విభేదాలను ఇంకా మనసులో పెట్టుకున్నాడని విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్‌కు స్పందించిన గంగూలీ.. ముందు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం నేర్చుకోవాలని, లేకుంటే బాగా తెలిసిన వారితో చెప్పించుకోవాలని హితవు పలికాడు.
తన ట్వీట్ ఉద్దేశం ఇద్దర్ని కొనియాడినట్లేనని గంగూలీ పరోక్షంగా స్పష్టం చేశాడు. కోహ్లీ పేరు ప్రస్తావించకున్నా.. అతని సెంచరీలను కూడా కొనియాడినట్లేనని చెప్పకనే చెప్పాడు.