టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడని కొనియాడాడు. అతని సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిందని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టు బాగుందని తెలిపాడు. ఇది అద్భుతమైన జట్టు అని, ఆటగాళ్లందరూ బాగా ఆడుతారని చెప్పాడు.
వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించి శుభ్‌మన్ గిల్‌ను నయా సారథిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. దాంతో కోహ్లీ, రోహిత్ వన్డే ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. రోహిత్, కోహ్లీలు మాత్రం వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా సన్నదమవుతున్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన గంగూలీని కెప్టెన్సీ మార్పు గురించి ప్రశ్నించగా.. కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ అనుమతితోనే కెప్టెన్సీ మార్పు చేశారని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టు బాగుందన్నాడు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ అద్భుతంగా ఆడుతుందని, బిగ్ మ్యాచ్‌లు ముందున్నాయని చెప్పాడు.
'రోహిత్ శర్మ అద్భుతమైన సారథి. కెప్టెన్‌గా అతను టీ20 ప్రపంచకప్ 2025తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టు సొంతంగా ఎంచుకున్నది. ఆటగాళ్లందరూ బాగా ఆడుతారు. అందుకే వారికి అవకాశం దక్కింది. జట్టు బాగుంది. కెప్టెన్సీ మార్పుపై కచ్చితంగా రోహిత్ శర్మకు సమాచారమిచ్చి ఉంటారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
రోహిత్ శర్మ ప్రదర్శనతో వచ్చే సమస్య ఏం లేదు. 2027లో రోహిత్ 40 ఏళ్లకు చేరుకుంటాడు. క్రీడల్లో అది పెద్ద సంఖ్యే. కెప్టెన్సీ కోల్పోవడం సహజమే. ఇది నాకు జరిగింది. రాహుల్ ద్రవిడ్‌కు ఈ అనుభవం ఎదురైంది. ప్రతీ ఒక్కరు ఏదో ఒక రోజు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సిందే.
మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శనే చేస్తుంది. ఈ టోర్నీలో వారికి అసలు మ్యాచ్‌లు భవిష్యత్తులో ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే వారికి మంచి ఆరంభం దక్కింది. కానీ పెద్ద జట్లతో ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. అయితే ఈ జట్లను ఓడించే సత్తా భారత మహిళల జట్టుకు ఉంది.'అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
వన్డే ప్రపంచకప్ 2027 వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులో కొనసాగించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. వారి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం.. వారు జట్టులో కొనసాగుతారని స్పష్టం చేశాడు.