
హైదరాబాద్: యువ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జోస్యం చెప్పాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ (128 నాటౌట్: 63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సులు)తో ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ 'రిషబ్ పంత్ భారత ఆశాకిరణం. అతనే కాదు.. రెండు రోజుల క్రితం కోల్‌కతాపై 21 బంతుల్లో 62 పరుగులు చేసిన ముంబై యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కి కూడా మంచి భవిష్యత్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరూ టీమిండియాకి ఆడతారు' అని గంగూలీ అన్నాడు.
'వారిద్దరూ ఇంకా యువకులు కాబట్టి.. తొందర లేదు. ఎందుకంటే ఆటలో దూకుడు కంటే.. నిలకడ చాలా ముఖ్యం. అందుకే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి వారు పరిపక్వత సాధించాలి. ఇషాన్ కిషన్ ఆటని చూసిన తర్వాత.. అతని గురించి చదివాను. టీమిండియాకి ఎంపిక చేసేటప్పుడు క్రికెటర్ నిలకడని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు' అని తెలిపాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'ఎన్నిస్లారు సదరు ఆ క్రికెటర్ మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడాడో సెలక్టర్లు పరిశీలిస్తారు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో మెక్‌కలమ్ మెరుపు సెంచరీని నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి నేను చూశాను. రిషబ్ పంత్ గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం' అని సౌరవ్ గంగూలీ కొనియాడాడు.
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్ (92 నాటౌట్), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (83 నాటౌట్) రాణించడంతో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయ సెంచరీ (128 పరుగులు) చేసిన పంత్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇది 50వ సెంచరీ. అంతేకాదు, ఈ సీజన్‌లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. జనవరిలో పంత్ 32 బంతుల్లోనే సెంచరీ సాధించి వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
128 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. 2010లో మురళీ విజయ్ 56 బంతుల్లో 127 పరుగులు చేయగా, పంత్ ఆ రికార్డును అధిగమించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 12 మంది భారత ఆటగాళ్లు సెంచరీలు బాదగా రిషబ్ పంత్ 13వ వాడిగా ఆ జాబితాలో చేరాడు.