
న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తానేమి మాట్లాడలేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ వివాదాన్ని చక్కదిద్దేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుందని, అన్నిటికీ బోర్డే సమాధానాలు చెబుతుందన్నాడు. వన్డే కెప్టెన్సీ మార్పుతో భారత క్రికెట్‌లో రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. నిన్నటి వరకు రోహిత్ X విరాట్‌గా ఉన్న పరిస్థితి.. ఇప్పుడు కోహ్లీ X బీసీసీఐగా మారింది.
టీ20 కెప్టెన్సీ వదులు కోవద్దని తాను కోహ్లీని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశానని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పగా.. అలాంటిదేమి జరగలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 కెప్టెన్సీపై పునరాలోచన చేయాలని తనను ఎవరూ కోరలేదని సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో విరాట్ కోహ్లీ కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ మార్పుపై కూడా తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీతో సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు.
దాంతో బీసీసీఐ పెద్దలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. జట్టుకు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీ పట్ల బీసీసీఐ ప్రవర్తించిన తీరు బాలేదని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మండిపడ్డారు. ఇక సునీల్ గవాస్కర్, ఆకాశ్ చోప్రా వంటి భారత మాజీ క్రికెటర్లు.. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వివరణ ఇవ్వాలని కోరారు. విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యల పట్ల స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలోనే గంగూలీ వర్షన్ కోసం ఏబీపీ న్యూస్ ప్రయత్నించగా.. ఈ విషయంపై మాట్లాడేందుకు గంగూలీ నిరాకరించినట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై వ్యక్తిగతంగా తాను ఎలాంటి కామెంట్స్ చేయనని సమాధానం ధాటవేసాడు. ఎక్కడైనా... ఎప్పుడైనా ఏ విషయమైనా బీసీసీఐనే చెబతుందన్నాడు. ఈ వివాదాన్ని సద్దుమణిగించే వారు ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. మరోవైపు కోహ్లీ చేసిన వ్యాఖ్యల పట్ల బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై స్పష్టతనిస్తూ ప్రెస్ మీట్ పెట్టాలా? లేక ప్రకటనను విడుదల చేయాలా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపి వివరణ కూడా కోరనున్నట్లు తెలుస్తోంది.