టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌ను ఎంపిక చేసే విషయంలో కాస్త తెలివిని ప్రదర్శించాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన గంగూలీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఒక ఆటగాడి జీవితంలో కోచ్ పదవి చాలా కీలకమైంది. హెడ్ కోచ్ అనేవారు మెంటార్‌గా, కనికరం లేని శిక్షణతో ఆటగాళ్లను అత్యుత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. వ్యక్తిత్వపరంగానూ ఆటగాళ్లను మార్చాల్సిన అవసరం ఉంటుంది. కోచ్ పదవి కోసం ఎంపిక చేసేటప్పుడు కాస్త తెలివిని ప్రదర్శించాలి'అని గంగూలీ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. ఈ లోగా బీసీసీఐ కొత్త కోచ్ ఎంపికను పూర్తి చేసి జూలై 1 నుంచి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. గత సోమవారంతోనే దరఖాస్తుల గడువు కూడా ముగిసింది.
టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ గంభీర్ మాత్రం తాను కేకేఆర్ మెంటార్‌గానే కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. దాంతో ఆశిష్ నెహ్రాతో పాటు విదేశీ కోచ్‌లు టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ తెలివిని ప్రదర్శించాలని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
గౌతమ్ గంభీర్‌ను నియమించారనే వార్తలతోనే గంగూలీ ఈ ట్వీట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. హర్భజన్ సింగ్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆశిష్ నెహ్రాను తదుపరి హెడ్ కోచ్‌గా నియమించాలని చెప్పాడు.
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐకి మొత్తం 3వేల అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో చాలా వరకు ఫేక్ అప్లికేషన్స్ ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సన్నీలియోన్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఫేక్ అప్లికేషన్స్ వచ్చినట్లు కథనాలు వచ్చాయి.