Sourav Ganguly Birthday:అటిట్యూడ్‌కే అమ్మ మొగుడు.. టీమిండియాను మరోస్థాయికి తీసుకెళ్లిన 'బెంగాల్ టైగర్'!

హైదరాబాద్: భారత క్రికెట్‌కు దూకుడును పరిచయం చేసిన సూపర్ కెప్టెన్.! మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో మసకబారిన భారత క్రికెట్‌కు వెలుగునిచ్చిన యోధుడు! మైదానంలోనూ, వ్యక్తిగత జీవితంలో ఎక్కడా రాజీపడని మనస్తత్వంతో భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ధీరుడు.! అతను మరెవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ! అటిట్యూడ్‌కే అమ్మ మొగుడైన దాదా.. శుక్రవారం 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దాదా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను అభిమానులను గుర్తు చేసుకుంటున్నారు. అతని జీవిత ప్రయాణాన్ని నెమరువేసుకుంటున్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో..
1972, జులై 8న కోల్‌కతాలో జన్మించిన సౌరవ్ గంగూలీ పూర్తి పేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ. అభిమానులు ముద్దుగా పిలుకునే పేరు దాదా. 1992లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశారు. 1996లో ఇంగ్లండ్ టెస్టు సిరిస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సౌరవ్ గంగూలీ ఎంపికయ్యారు. అయితే ఆ సిరిస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ-మహమ్మద్ అజారుద్దీన్‌ల మధ్య గొడవ జరగడంతో.. ఉన్నపళంగా సిద్దూ స్వదేశం తిరుగు పయనమయ్యాడు. దీంతో అతని స్థానంలో అరంగేట్రం చేసిన దాదా.. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీ చేశారు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం భారత్ క్రికెట్‌పై పెనుప్రభావం చూపింది. ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో .. దాదా ఆ బాధ్యతలను అందుకున్నాడు.

లార్డ్స్ బాల్కనీలో దాదా హంగామా..
విదేశీ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగుతుంటే అప్పటి వరకూ మౌనంగా ఉండిపోయిన భారత క్రికెటర్లు.. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే ధీటుగా బదులివ్వడం నేర్చుకున్నారు. దీంతోనే విదేశాల్లోనూ భారత్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. ఇక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో లార్డ్స్ బాల్కనీలో దాదా చొక్కా విప్పిన సంఘటన అభిమానులకు ఇప్పటికీ గుర్తే. ఫైనల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా నెగ్గింది. ఆ విజయంతో మరింత దూకుడుగా మారిన దాదా.. కెప్టెన్‌గా భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి చాటారు. అయితే 2003 ప్రపంచకప్‌లో గంగూలీ కెప్టెన్సీలోనే టీమిండియా ఫైనల్‌కు చేరింది. కానీ తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

ప్రపంచకప్ గెలవకపోయినా..
సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీ కాలంలో ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారు. అందరూ కూడా ఓ వెలుగువెలిగారు. ఇందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మొహమ్మద్ కైఫ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ, ఆశిష్ నెహ్రా లాంటి వారు ఉన్నారు. వీరందరూ విఫలమయిన ప్రతిసారి అండగా నిలిచేవారు. 2005లో ఫామ్ కోల్పోవడంతో దాదా జట్టుకు దూరమయ్యారు. అప్పటి వైస్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. దాదా నిష్క్రమణకు అప్పటి కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ కూడా ఓ కారణం. ఆస్ట్రేలియాతో 2008 నాగ్‌పుర్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడారు. ఆ తర్వాత దాదా పాక్‌పై 2011లో తన చివరి వన్డేని ఆడారు. ఆపై ఐపీఎల్లో కొనసాగినా.. 2012లో దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. గతంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదా.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

113 టెస్టులు.. 311 వన్డేలు:
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 146 వన్డేలాడిన టీమిండియా.. 76 మ్యాచ్‌ల్లో గెలుపొంది 65 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. టెస్టు ఫార్మాట్‌లోనూ దాదా కెప్టెన్సీలో భారత్ జట్టు 49 మ్యాచ్‌లు ఆడగా.. 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 13 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. భారత్ తరఫున కెరీర్‌లో 113 టెస్టులాడిన 'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా' గంగూలీ 16 శతకాలు, 35 అర్ధ శతకాల సాయంతో 7212 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 239. ఇక 311 వన్డేలు ఆడిన గంగూలీ.. 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11363 పరుగులు సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications