హైదరాబాద్: భారత క్రికెట్‌కు దూకుడును పరిచయం చేసిన సూపర్ కెప్టెన్.! మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో మసకబారిన భారత క్రికెట్‌కు వెలుగునిచ్చిన యోధుడు! మైదానంలోనూ, వ్యక్తిగత జీవితంలో ఎక్కడా రాజీపడని మనస్తత్వంతో భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ధీరుడు.! అతను మరెవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ!
అటిట్యూడ్‌కే అమ్మ మొగుడైన దాదా.. శనివారం(జూలై 8న) 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దాదాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మైఖేల్ తెలుగు ప్రత్యేకకథనం.!

ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా : 1972, జులై 8న కోల్‌కతాలో జన్మించిన సౌరవ్ గంగూలీ పూర్తి పేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ. అభిమానులు ముద్దుగా దాదా, ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా, 'మహారాజా ఆఫ్ ఇండియన్ క్రికెట్', 'గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్' అని పిలుచుకుంటారు. 1992లో వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్‌తో దాదా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు.
మరో నాలుగేళ్ల వరకు అతనికి టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం దక్కలేదు. 1996 ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న సౌరవ్ గంగూలీకి అనూహ్యంగా తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది. జట్టులోని అప్పటి సీనియర్ ఆటగాళ్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ-మహమ్మద్ అజారుద్దీన్‌ల మధ్య గొడవ జరిగింది. దాంతో ఉన్నపళంగా సిద్దూ స్వదేశం తిరుగు పయనమయ్యాడు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ : అతని స్థానంలో ఆడే అవకాశం అందుకున్న దాదా.. క్రికెట్ మక్కా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోనే తొలి టెస్ట్ ఆడాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం భారత్ క్రికెట్‌పై పెనుప్రభావం చూపింది. ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు.
ఈ పరిస్థితుల్లో ఎవరూ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో .. దాదాకు ఆ బాధ్యతలు వరించాయి. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో జట్టులోకి కుర్రాళ్లు రాగా.. గంగూలీ తన కెప్టెన్సీలో జట్టును పూర్తిగా మార్చేసాడు. విదేశీ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగుతుంటే అప్పటి వరకూ మౌనంగా ఉండిపోయిన భారత క్రికెటర్లు.. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే ధీటుగా బదులివ్వడం నేర్చుకున్నారు.
చొక్కా విప్పి : ఈ అటిట్యూడ్‌తో విదేశాల్లోనూ భారత్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. ఇక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో లార్డ్స్ బాల్కనీలో దాదా చొక్కా విప్పిన సంఘటన అభిమానులకు ఇప్పటికీ గుర్తే. ఫైనల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా నెగ్గింది.

ఆ విజయంతో మరింత దూకుడుగా మారిన దాదా.. కెప్టెన్‌గా భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి చాటారు. అయితే 2003 ప్రపంచకప్‌లో గంగూలీ కెప్టెన్సీలోనే టీమిండియా ఫైనల్‌కు చేరింది. కానీ తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
ఖతర్నాక్ ఆటగాళ్లను పరిచయం చేసిన దాదా : కెప్టెన్‌గా దాదా ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారు. అతని హయాంలో భారత జట్టుకు ఆడిన ఆటగాళ్లంతా ఓ వెలుగు వెలిగారు. ఇందులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మహమ్మద్ కైఫ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ, ఆశిష్ నెహ్రా లాంటి వారు ఉన్నారు. వీరందరూ విఫలమయిన ప్రతిసారి దాదా అండగా నిలిచేవారు.
2005లో ఫామ్ కోల్పోవడంతో దాదా జట్టుకు దూరమయ్యారు. అప్పటి వైస్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దాదా నిష్క్రమణకు అప్పటి కోచ్‌గా గ్రెగ్ఛాపెల్ కూడా ఓ కారణం. ఆస్ట్రేలియాతో 2008 నాగ్‌పుర్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడారు. ఆ తర్వాత దాదా పాక్‌పై 2011లో తన చివరి వన్డేని ఆడారు.

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా : ఆపై ఐపీఎల్లో కొనసాగినా.. 2012లో దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ఇచ్చారు. గతంలో క్రికెట్అసోసియేషన్ఆఫ్బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదా.. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా భారత క్రికెట్‌లో చాలా మార్పులు తీసుకొచ్చారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్, రంజీ ప్లేయర్ల జీతాలు, పురుష, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్నా.. సహచర బోర్డు మెంబర్స్‌తో ఉన్న బేధాభిప్రాయాలతో బీసీసీఐకి దూరమయ్యారు. భారత్ తరఫున కెరీర్‌లో 113 టెస్టులాడిన 'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా' గంగూలీ 16 శతకాలు, 35 అర్ధ శతకాల సాయంతో 7212 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 239. ఇక 311 వన్డేలు ఆడిన గంగూలీ.. 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11363 పరుగులు సాధించారు.