
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా పదవీకాలంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీసీసీఐ రాజ్యాంగానికి పలు సవరణలు చేయాలని కోరుతూ బోర్డు వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు బుధవారం వచ్చే నెలకు వాయిదా వేసింది. దాంతో, అప్పటిదాకా ఈ ఇద్దరూ బోర్డును నడిపించనున్నారు.
బీసీసీఐ ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ, జై షాతో పాటు జాయింట్ సెక్రటరీ జయేశ్ జార్జ్ పదవీకాలం కొన్ని నెలల కిందటే ముగిసింది. స్టేట్ అసోసియేషన్, బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేళ్లు పదవిలో ఉన్న ఈ ముగ్గురూ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం కచ్చితంగా మూడేళ్ల విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్) తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే, కూలింగ్ ఆఫ్ నిబంధన సహా బీసీసీఐ రాజ్యాంగంలో పలు సవరణలు చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ బోర్డు ట్రెజరర్ అరుణ్ ధూమల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న విచారణను సుప్రీం బెంచ్ బుధవారం తమ జాబితాలో చేర్చింది. దాంతో, దాదా, జై షా భవితవ్యంపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ, ఈ కేసును జనవరి మూడో వారంలో విచారణ జాబితాలో చేర్చాలని కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 24న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు గంగూలీకి లైన్ క్లియర్ అయింది. దాదా అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌కు జై షా, జయేశ్ కూడా హాజరుకానున్నారు. కాగా, స్టేట్ అసోసియేషన్లు దాఖలు చేసిన పలు పిటిషన్లను మాత్రం కోర్టు విచారించింది. అయితే, ఫండ్స్‌కు సంబంధించిన చాలా కేసుల్లో తాము కల్పించుకోవాల్సిన అవసరం లేదని చెబుతూ వాటిని కొట్టివేసింది. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. దాదా కూడా అక్కడికి వెళ్లాడు. వన్డే సిరీస్ ఓడి.. టీ20 సిరీస్ నెగ్గిన భారత జట్టు.. నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం సమాయత్తం అవుతోంది.