టీమిండియా కెప్టెన్ల తీరుపై మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశాడు. కెప్టెన్లకు నచ్చితేనే జట్టులో అవకాశాలు దక్కుతాయని, నచ్చకపోతే వేటు పడుతుందని పరోక్షంగా తెలిపాడు. 42 ఏళ్ల అమిత్ మిశ్రా బుధవారం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్ తరఫున 22 టెస్ట్‌లు, 36 వన్డేలు, 10 టీ20 మాత్రమే ఆడి వరుసగా 76, 64, 16 వికెట్లు పడగొట్టాడు. గాయాల బెడదతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
రిటైర్మెంట్ నేపథ్యంలో ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా.. తనకు టీమిండియాలో తక్కువ అవకాశాలు రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టీమిండియాలో వరుసగా అవకాశాలు రాకపోతే ఏ ఆటగాడికైనా నిరాశ కలుగుతోంది. ఒక్కోసారి జట్టులో ఉంటాం..మరోసారి ఉండం. తుది జట్టులోనూ ఒకసారి అవకాశం దక్కుతుంది. మరొకసారి దక్కదు. సహజంగానే ఇది చాలా నిరాశకు గురి చేస్తోంది. నేను కూడా చాలా సార్లు నిరాశకు గురయ్యాను. కానీ అదే సమయంలో భారత్ జట్టుకు ఆడటం కల అని, భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు లక్షలాది మంది పోటీ పడుతున్నారని, అలాంటి 15 మంది జట్టులో నువ్వు ఒకడిగా ఉన్నావనే విషయాన్ని గ్రహించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించేవాడిని.

ప్రతిభ ఉన్నా అవకాశాలు రాకపోవడంతో మానసికంగా చాలా కష్టంగా ఉండేది. నిరాశకు గురైనప్పుడుల్లా ఆటను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెట్టేవాడిని. అది ఫిట్‌నెస్, బ్యాటింగ్, బౌలింగ్ ఎదైనా మరింత మెరుగయ్యేందుకు కష్టపడేవాడిని. భారత జట్టు తరఫున అవకాశం దక్కినప్పుడల్లా నేను మెరుగ్గా రాణించాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కష్టపడటానికి ఎప్పుడూ వెనుకాడలేదు.
కొంతమంది ఆటగాళ్లంటే కెప్టెన్లకు ఇష్టం. కాబట్టి వారికి వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి. అయినా అదో పెద్ద విషయం కాదు. ఏదేమైనా మనల్ని మనం నిరూపించుకునే అవకాశం వస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపై అంతా ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్‌లో నేను భారత స్టార్ ఆటగాళ్లను ఔట్ చేసినప్పుడు చాలా గర్వపడేవాడిని. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ళు ఏ క్షణంలోనైనా ఆట స్వరూపాన్ని మార్చేయగలరు.
అనిల్ కుంబ్లే గాయంతో జట్టుకు దూరమవడంతో నాకు తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయమే అనిల్ భాయ్ గాయం గురించి జట్టుకు సమాచారమిచ్చారు. ఆస్ట్రేలియాపై అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసాను. అది నాకు గొప్ప జ్ఞాపకం. అనిల్ భాయ్ స్థానాన్ని భర్తీ చేయడం గొప్ప విషయం. ఒత్తిడిలోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాను.
నేను సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలతో పాటు ధోనీ, రోహిత్, కోహ్లీ సారథ్యంలో మూడు దశాబ్దాల పాటు క్రికెట్ ఆడాను. ఇప్పుడు ఆటకు దూరమవుతున్నాను. అందుకు భావోద్వేగంగా ఉన్నా.. క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. గౌరవం, గుర్తింపు దక్కాయి. ప్రతీ ఒక్కరికి ఘన వీడ్కోలు లభించదు. అయినా నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నేను మనసు పెట్టి ఆడాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అభిమానుల ప్రేమ, సహచరుల గౌరవాన్ని సంపాదించుకున్నాను. అది నా గొప్ప విజయం.'అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.