మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌తో ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఒత్తిడిని తట్టుకోలేక చేజేతులా చేజార్చుకుంది. విజయం ముంగిట చెత్త షాట్లతో మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. తన వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని, తన షాట్ సెలెక్షన్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడింది.
ఈ ఓటమితో కన్నీటి పర్యంతమైన స్మృతి మంధాన.. తదుపరి మ్యాచ్‌లో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతానని తెలిపింది. 'ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ఒక్కసారిగా కూలిపోయాం. విజయ సమీకరణం బంతికి ఒక పరుగు ఉన్నా కూడా మేం చెత్త షాట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాం. మేం కాస్త మెరుగైన షాట్స్ ఆడాల్సింది. ముఖ్యంగా మా పతనం నాతోనే మొదలైంది. కాబట్టి ఈ ఓటమికి నాదే పూర్తి బాధ్యత. నా షాట్ సెలెక్షన్ కాస్త తెలివిగా ఉండాల్సింది. మాకు ఓవర్‌కు 6 పరుగులు మాత్రమే కావాలి. ఇలాంటి సమయంలో చెత్తా షాట్స్ ఆడకుండా మ్యాచ్‌ను మరింత డీప్ తీసుకెళ్లాల్సింది. నా వల్లే ఈ ఓటమి.

తదుపరి మ్యాచ్ గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరవుతుంది. కానీ క్రికెట్‌లో సులువుగా లభించదు. కానీ సెమీఫైనల్ చేరాలంటే తదుపరి మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. ఈ మ్యాచ్ మాకు క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ రోజుల్లో క్రికెట్ అంత సులువు కాదు. ఈ ఓటమిని మేం ఓ గుణ పాఠంగా తీసుకుంటాం.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. హీథర్ నైట్(91 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 109) సెంచరీతో చెలరేగగా.. అమీ జోన్స్(68 బంతుల్లో 8 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ(4/51) నాలుగు వికెట్లు తీయగా.. తెలుగు తేజం శ్రీ చరణి(2/68) రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 284 పరుగులు చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధాన(94 బంతుల్లో 8 ఫోర్లతో 88), హర్మన్ ప్రీత్ కౌర్(70 బంతుల్లో 10 ఫోర్లతో 70), దీప్తి శర్మ(57 బంతుల్లో 5 ఫోర్లతో 50 ) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో నాట్ స్కివర్ బ్రంట్(2/47) రెండు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, లిన్సీ స్మిత్, చార్లా డీన్, సోఫీ ఎక్లీస్టోన్ తలో వికెట్ తీసారు. 52 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో చెత్త షాట్స్‌తో మంధాన, రిచా ఘోష్, దీప్తి శర్మ వికెట్లు పారేసుకొని ఓటమికి కారణమయ్యారు.