టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తనను పోల్చడం సరికాదని మహిళా ప్లేయర్ స్మృతి మంధాన అన్నారు. 18 నెంబర్ జెర్సీని ధరించినంత మాత్రానా కోహ్లీ పోలుస్తారా? అని ప్రశ్నించారు. విరాట్ కోహ్లీ ఆటగాడిగా ఎంతో సాధించాడని, అతను వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అని చెప్పుకొచ్చింది.
భారత మహిళా క్రికెట్‌లో సూపర్ స్టార్ అయిన స్మృతి మంధాన.. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. రెండో సీజన్‌లోనే టైటిల్ అందించింది. దాంతో ఆమెను అంతా లేడీ కోహ్లీ అని పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీతో తనను పోల్చడాన్ని స్మృతి మంధాన తప్పుబట్టింది.

'నాకు పోలికలు ఏమాత్రం నచ్చవు. 18వ నెంబర్ జెర్సీని ధరించినంత మాత్రానా నన్ను కోహ్లీతో పోల్చడం సరికాదు. ఓ ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎంతో సాధించాడు. అతనో దిగ్గజ ఆటగాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఫ్రాంచైజీ క్రికెట్ అనేది చాలా వరకు లక్‌పై ఆధారపడి ఉంటుందని నా ఫీలింగ్. ఏమో.. మేం సాధించిన డబ్ల్యూటీసీ టైటిల్‌తో ఆర్‌సీబీ తలరాత మారవచ్చు.'అని తెలిపింది.
ప్రస్తుతం స్మృతి మంధాన టీమిండియా మహిళల వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. కోహ్లీ తరహాలోనే పరుగుల మోత మోగిస్తోంది. ఈ ఏడాది మంధాన సూపర్ ఫామ్‌లో ఉంది. సౌతాఫ్రికాతో వరుసగా రెండు శతకాలు నమోదు చేసింది. సఫారీలతో జరిగిన ఏకైక టెస్ట్‌లో 149 పరుగులతో రాణించింది. ఈ ప్రదర్శనతో ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకుంది.
ఇటీవల ముగిసిన మహిళల ఆసియాకప్ 2024లోనూ సత్తా చాటింది. కానీ ఈ టోర్నీ ఫైనల్లో భారత్.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం మంధాన ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల 100 లీగ్ ఆడుతోంది.