మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత బ్యాటర్లు శుభారంభం చేశారు. న్యూ ఛండీఘర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత బ్యాటర్లు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేశారు. ఓపెనర్లు ప్రతికా రావల్(94 బంతుల్లో 6 ఫోర్లతో 64), స్మృతి మంధాన(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో ఫామ్ కనబర్చగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్(57 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(11), జెమీమా రోడ్రిగ్స్(18) విఫలమైనా.. రిచా ఘోష్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), దీప్తి శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లతో 20) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగన్ స్కట్(2/45) రెండు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, అన్నేబెల్ సదర్లాండ్, అలనా కింగ్, తహిలా మెక్‌గ్రాత్ చెరో వికెట్ తీసారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన ప్రతికా రావల్ శుభారంభం అందించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో తొలి పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. అనంతరం మరింత సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ పోటాపడి బౌండరీలు బాదింది. ఈ క్రమంలో స్మృతి మందాన 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే ప్రతికా రావల్‌తో సమన్వయం లోపం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
హర్లీన్ డియోల్ సాయంతో ప్రతికా రావల్ 67 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆచితూచి ఆడిన ఆమెను అలనా కింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్(11) నిరాశపర్చగా.. జెమీమాతో కలిసి హర్లీన్ డియోల్ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ వెంటనే ఆమెను మెగన్ స్కట్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చింది. జెమీమా కూడా ఔటవ్వగా.. రిచా ఘోష్, దీప్తి శర్మ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో రిచా ఘోష్, రాధా యాదవ్(19) వెనుదిరగ్గా.. తెలుగు తేజం శ్రీ చరణితో కలిసి దీప్తి శర్మ భారత్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించింది.