
న్యూఢిల్లీ: వచ్చే నెల 4 నుంచి ప్రారంభమయ్యే మహిళల వన్డే ప్రపంచకప్ ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తలకు తీవ్ర గాయమైంది. ఈ మెగాటోర్నీ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఈ విచారకర ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ 2 ఓవర్‌లో సౌతాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ వేసిన రాకసి బౌన్సర్.. మంధాన హెల్మెట్‌కు బలంగా తాకింది. ఫుల్ షాట్ ఆడే క్రమంలో టైమింగ్ మిస్సవడంతో బంతి హెల్మెట్‌ను ముద్దాడింది.
అయితే వెంటనే ఫీల్డ్‌లోకి ఫిజియో వచ్చి మంధానను పరిశీలించాడు. అయితే ఆమెకు ఎలాంటి కంకషన్ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఆమెకు తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని ఫిజియో నిర్ధారించాడు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మంధాన ఫీల్డ్‌ను విడిచి వెళ్లింది. 12 పరుగులు చేసిన ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. అయితే వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే మంధాన గాయంపై క్లారిటీ రానుంది. గాయం తీవ్రమై ఆమె జట్టుకు దూరమైతే మాత్రం.. తీవ్ర నష్టం వాటిల్లనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాపై భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో హర్మాన్ ప్రీత్ కౌర్(103) సెంచరీతో మెరిసింది. అమెకు తోడుగా, యస్తికా భాటియా(58) పరుగులతో రాణించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్ జట్టు 242 పరుగులకే పరిమితమైంది.
న్యూజిలాండ్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో.. బే ఓవల్ వేదికగా ఆతిథ్య జట్టు, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మార్చి 6న టీమిండియా.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది.