Smriti Mandhana: లారెన్ బెల్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతోనే విజేతగా నిలిచామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ముఖ్యంగా ఫైనల్లో లారెన్ బెల్ వేసిన స్పెల్.. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అని కొనియాడింది. గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రెండో టైటిల్‌ను ముద్దాడింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని అధిగమించిన జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది.
ఈ విజయానంతరం మాట్లాడిన స్మృతి మంధాన లారెన్ బెల్‌తో పాటు జార్జియో వాల్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ ప్రపంచంలోనే ఆర్‌సీబీ అభిమానులు అత్యుత్తమ ఫ్యాన్స్ అని కొనియాడింది. 'ప్రపంచంలోనే ఆర్‌సీబీ అభిమానులు అత్యుత్తమ ఫ్యాన్స్. నాలుగేళ్లలో రెండు టైటిల్స్ గెలవడం అనేది అద్భుతం. మైదానం పెద్దది కావడంతో 204 స్కోర్ మంచిదని భావించాం. కానీ చివరి 4 ఓవర్లలో మేం అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను తిరిగి మావైపు తిప్పుకున్నాం. లారెన్ బెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో దాదాపు 400 పరుగులు నమోదైనప్పటికీ ఆమె కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చింది. నా దృష్టిలో ఆమెది మ్యాచ్ విన్నింగ్ స్పెల్.

బ్యాటింగ్‌లో జార్జియో వాల్ అద్భుతంగా ఆరంభించింది. పవర్ ప్లేలో పూర్తిగా తనే స్ట్రైక్ తీసుకుంది.'ఫైనల్లో వాల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడుతుంది' అని నేను మా ప్లేయర్లతో చెప్పడం నాకు గుర్తుంది. మా సపోర్ట్ స్టాఫ్ కూడా చాలా గొప్ప సహకారం అందించారు. మా అమ్మాయిలు చాలా కష్టపడ్డారు. ఈ విజయం వారిపై వారి నమ్మకాన్ని పెంచుతుంది. వారు జిమ్‌లో ఎంతో కష్టపడ్డారు. అదే ఏ స్కోరునైనా ఛేజ్ చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కానీ వాల్ చేసినది మాత్రం చాలా ప్రత్యేకం. ఈ రోజు ఇంటికి వెళ్లేటప్పుడు మా జట్టులోని ప్రతి ఒక్కరూ.. 'నేను కూడా ఈ గెలుపులో నా వంతు పాత్ర పోషించాను' అని గర్వంగా చెప్పుకుంటారు. నేను 2024లో చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. 'ఈ సాలా కప్ నమ్దు 2'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(37 బంతుల్లో 8 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. లారా వోల్వర్డ్ట్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), చినెల్ హెన్రీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే(1/46), అరుంధతి రెడ్డి(1/40), నదినే డీ క్లెర్క్(1/48) తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియో వాల్(54 బంతుల్లో 14 ఫోర్లతో 79), స్మృతి మంధాన(41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) రెండో వికెట్‌కు 165 పరుగులు జోడించి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చినెల్ హెన్రీ(2/34) రెండు వికెట్లు తీయగా.. నందని శర్మ, మిన్ను చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు తేజం శ్రీ చరణి(0/46) తీవ్రంగా నిరాశపర్చింది.