
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అంచనాలను అందుకోలేకపోయిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన అభిమానులకు క్షమాపణలు తెలిపింది. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈ మహిళా ఓపెనర్.. కేవలం 49 పరుగులే చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో బాధ్యాతాయుతంగా ఆడాల్సిన సమయంలో కేవలం 11 పరుగులే చేసి పెవిలియన్ చేరింది. అనంతరం మిగతా బ్యాటర్లు కూడా ఆమె బాటలోనే క్యూ కట్టడంతో హర్మన్‌ప్రీత్ సేన 85 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి మరోసారి తమ కలను సాకారం చేసుకునే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.
అయితే తనపై ఎంతో నమ్మకుం ఉంచిన అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశానని, అందుకు తనని క్షమించాలని మంధాన సోషల్ మీడియా వేదికగా కోరింది. 'ఫైనల్ మ్యాచ్‌ని చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. అలానే టోర్నీ ఆరంభం నుంచి జట్టుకు లక్షలాది మంది ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు. కానీ.. ఫైనల్లో గెలవలేకపోయినందుకు క్షమించాలి. మ్యాచ్ ఓడినప్పటికీ.. వివిధ వర్గాల నుంచి మాకు పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. ఇకపై కూడా ఈ సపోర్ట్ కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని మంధానా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 86,174 మంది అభిమానులు వచ్చిన విషయం తెలిసిందే.
View this post on InstagramA post shared by Smriti Mandhana (@smriti_mandhana) on
టీ20 ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాని ఓడించిన భారత్ జట్టు.. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్‌పై నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. అయితే.. వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీస్ మ్యాచ్ రద్దవడంతో గ్రూప్ టాపర్‌గా నేరుగా ఫైనల్‌కు చేరిన భారత్.. ఆస్ట్రేలియాను మాత్రం ఓడించలేకపోయింది. దీంతో.. ఆస్ట్రేలియా ఐదోసారి విజేతగా నిలవగా.. తొలిసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని భారత్ చేజేతులా చేజార్చుకుంది.