టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా మంధాన నిలిచింది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన ఫైనల్లో 45 పరుగులతో రాణించిన స్మృతి మంధాన.. ఈ టోర్నీలో మొత్తం 434 పరుగులు చేసింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డ్‌ను మంధాన అధిగమించింది. 2017 వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ 409 పరుగులు చేసింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఎడిషన్‌లో స్మృతి మంధాన సెకండ్ హయ్యెస్ట్ బ్యాటర్‌గా నిలిచింది. సౌతాఫ్రికా కెప్టెన్ లాలా వోల్వార్డ్ట్ 500+ రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఫైనల్లో షెఫాలీ వర్మతో కలిసి మంధాన తొలి వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది.

మరోవైపు ఫైనల్లో హాఫ్ సెంచరీతో రాణించిన దీప్తి శర్మ కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో దీప్తి శర్మ 215 పరుగులతో పాటు 17* వికెట్లు తీసింది. దాంతో మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో 200 ప్లస్ పరుగులు చేయడంతో పాటు 15 ప్లస్ వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. మరే ప్లేయర్ కూడా సింగిల్ ఎడిషన్‌లో ఈ ఫీట్ సాధించలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 58 ) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్మృతి మంధాన(58 బంతుల్లో 8 ఫోర్లతో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక(3/58) మూడు వికెట్లు తీయగా.. మ్లబా, డిక్లెర్క్, ట్రయాన్ తలో వికెట్ తీసారు.