ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలవడంపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరిదని స్పష్టం చేశాడు. 18 ఏళ్ల తర్వాత దక్కిన ఈ విజయాన్ని అస్సలు ఊహించలేదన్నాడు. దాంతోనే విజయం ఖాయమైన వెంటనే భావోద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయానంతరం కన్నీటి పర్యంతమైన విరాట్ కోహ్లీ.. బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ రాత్రి తాను పసిబిడ్డలా నిద్రపోతానని తెలిపాడు.
వారిదే ఈ విజయం..
'ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరిది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్కిన విజయం. ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోసాను. ఈ రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యాను. ఏబీ డివిలియర్స్ ఈ ఫ్రాంచైజీ కోసం ఎంతో చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందే మాతో కలిసి సంబరాలు చేసుకోవాలని ఏబీడిని కోరాను. ఆర్‌సీబీ తరఫున ఏబీడీ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటికీ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అతను రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లు అవుతున్నా.. మాతో పోడియంపై నిలిచేందుకు పూర్తి అర్హుడు. ఈ జట్టుకు నేను విధేయుడిగా ఉన్నాను. ఏది ఏమైనా.. ఇతర ఆలోచనలు వచ్చినా.. ఈ జట్టుకు నేను అంకితమయ్యాను. నా గుండె, ఆత్మ బెంగళూరుతో ఉంది. నేను ఐపీఎల్ ఆడే వరకు ఆర్‌సీబీకే ఆడుతాను. ఈ రాత్రి నేను పసిబిడ్డలా నిద్రపోతాను.

ఇక కొద్ది రోజులే..
ఐపీఎల్‌లో నేను ఎక్కువ రోజులు ఆడలేను. మాకు ఒక ముగింపు తేదీ ఉంది. ఆలోపు నా సాయశక్తులా జట్టు విజయం కోసం ప్రయత్నిస్తాను. ఎట్టకేలకు ఈ టైటిల్ నా ఒడిలో ఉంచిన ఆ దేవుడికి ధన్యవాదాలు. జట్టుకు అండగా ఉండేందుకు నేను విభిన్న మార్గాలను అన్వేషిస్తాను. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్, టీమ్ అద్భుతమైదని. వేలం తర్వాత చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేశారు. కానీ టోర్నీ ప్రారంభమైన రెండో రోజు మా జట్టు సత్తా ఏంటో అర్థమైంది. నా గురించి ఇప్పటికే చాలా మాట్లాడారు. ఈ విజయం బెంగళూరు కోసమే. ఈ క్షణం నా కెరీర్‌లోనే ఉత్తమమైనది. అయితే టెస్ట్ క్రికెట్ కంటే ఇది ఐదు స్థాయిలు కిందే ఉంటుంది. కుర్రాళ్లు గౌరవం కావాలనుకుంటే టెస్ట్ క్రికెట్‌ను ఎంచుకోవాలి. ఈ ఫైనల్లో కృనాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతని స్పెల్ చాలా రోజులు గుర్తుంటుంది.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
టాప్ స్కోరర్‌గా కోహ్లీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు.