కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ బౌలర్లు దుమ్మురేపారు. యువ పేసర్ నసీమ్ షా(3/41) నిప్పులు చెరగగా.. స్పిన్నర్ అబ్రర్ అహ్మద్(4/69) బంతితో శ్రీలంక బ్యాటర్లను చెడుగుడు ఆడాడు. దాంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 48.4 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలింది.
శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(68 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 57), దినేశ్ చండిమల్(60 బంతుల్లో 4 ఫోర్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి 28.3 ఓవర్లలో 2 వికెట్లకు 145 పరుగులు చేసింది.

ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్(99 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74 బ్యాటింగ్), బాబర్ ఆజామ్(8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇమామ్ ఉల్ హక్(6) విఫలమైనా.. షాన్‌మసూద్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ ఇంకా 21 పరుగుల వెనకంజలోనే ఉంది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో రెండు వికెట్లు తీసాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ నిషాన్ మధుషంక(4) షాన్ మసూద్ సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్(6) షాహిన్ అఫ్రిది ఔట్ చేయగా.. ఏంజేలో మాథ్యూస్(9)ను నసీమ్ షా పెవిలియన్ చేర్చాడు. ఆచితూచి ఆడుతున్న దిముత్ కరుణరత్నే(17)ను నసీమ్ షా క్లీన్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక 79/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్‌లో దినేశ్ చండీమల్(34), ధనంజయ డిసిల్వా(57) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఓపికగా ఆడుతూ కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించిన అనంతరం చండీమల్‌ను నసీమ్ షా ఔట్ చేయగా.. సమర విక్రమ(0) అబ్రర్ అహ్మద్ డకౌట్ చేశాడు.
హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన ధనంజయ డిసిల్వా(57)ను పెవిలియన్ చేర్చిన అబ్రర్ అహ్మద్.. రమేశ్ మెండీస్(27)ను కూడా క్యాచ్ ఔట్ చేశాడు. షాన్ మసూద్ సూపర్ ఫీల్డింగ్‌కు ప్రభత్ జయసూర్య రనౌట్ కాగా.. అసిత ఫెర్నాండోను అబ్రర్ అహ్మద్ ఔట్ చేసి శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెరదించాడు.