న్యూజిలాండ్ పర్యటనను శ్రీలంక విజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అక్లాండ్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో శ్రీలంక 140 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న న్యూజిలాండ్.. ఆఖరి వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 290 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66), కుశాల్ మెండీస్(48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), జనిత్ లియనగే(52 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు.

న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(4/55) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/55) రెండు వికెట్లు పడగొట్టాడు.నాథన్ స్మిత్, మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 29.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. మార్క్ చాప్‌మన్(81 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 81)హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, మహీష్ తీక్షణ, ఇషాన్ మలింగా మూడేసి వికెట్లు తీయగా.. జనిత్ లియనగే ఓ వికెట్ పడగొట్టాడు.
మూడు టీ20లు, మూడు వన్డేల కోసం న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన శ్రీలంక.. రెండు సిరీస్‌లను 1-2, 1-2 తేడాతో ఓటమిపాలైంది.