SL vs BAN: వన్డే ప్రపంచకప్ 2023లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఈ ఘటన సరికొత్త చర్చకు తెరలేపింది. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఈ వివాదాస్పద ఘటనకు వేదికైంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్.. టైమ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.
బ్యాటర్ ఔటైన తర్వాత నిర్ణీత సమయంలో క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కోకపోవడంతో అంపైర్ మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. షకీబ్ అల్ హసన్ వేసిన 25వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతికి సదీర సమరవిక్రమా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
దాంతో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే గార్డ్ తీసుకునే సమయంలో అతని హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోవడం గమనించిన అతను.. మరో హెల్మెట్ తీసుకురావాలని తమ డగౌట్ వైపు చూపించాడు. బంతి ఎదుర్కోకుండా హెల్మెట్ కోసం వేచి చూసాడు. అప్పటికే నిర్ణీత సమయం ముగియడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ అప్పీల్ చేశాడు. నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్.. మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు.

ఈ వికెట్‌పై మాథ్యూస్ అంపైర్లతో వాగ్వాదానికి దిగగా.. వారు ప్రత్యర్థి సారథితో మాట్లాడుకోవాలని సూచించారు. దాంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను మాథ్యూస్ రిక్వెస్ట్ చేసినా.. అతను పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం ఔటేనంటూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ఇష్టపడలేదు.
దాంతో మాథ్యూస్ కోపంగా మైదానం వీడాడు. చేతిలో ఉన్న హెల్మెట్‌ను నేలకు కొట్టాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ టైమ్ ఔట్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ నిబంధన ప్రకారం ఓ బ్యాటర్ ఔటైన తర్వాత 2 నిమిషాల లోపు మరో బ్యాటర్ స్ట్రైకింగ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ హెల్మెట్ కోసం మాథ్యూస్ వేచి చూడటంతో సమయం ముగిసింది.
ఈ వికెట్ అనైతికమని, చాలా అన్యాయమని, పాపం మాథ్యూస్ అంటూ ఫ్యాన్స్ షకీబ్ అల్ హసన్‌పై మండిపడుతున్నారు. ఈ తరం క్రికెట్‌లో క్రీడా స్పూర్తి మిస్సయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ లెక్కన చూసుకున్నా.. ఇది చాలా అన్యాయమని, హెల్మెట్ లేకుండా మాథ్యూస్ ఆడి తీవ్రంగా గాయపడితే ఏం చేసేవారని ప్రశ్నిస్తున్నారు.