వైభవ్ సూర్యవంశీ కోసం వారిని తప్పించడం అన్యాయం: టీమిండియా బ్యాటింగ్ కోచ్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం మరింత ఆలస్యం కానుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం ఇతర ఆటగాళ్లను తుది జట్టు నుంచి తప్పించలేమని, అది అన్యాయం కూడా అని బ్యాటింగ్ సితాన్షు కోటక్ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
15 ఏళ్ల వయసులో అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికయ్యాడు. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి 6 గంటలకు ఐర్లాండ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ సితాన్ష్ కోటక్ భిన్నంగా స్పందించాడు.
వైభవ్ కోసం వారిని తప్పించలేం..
ఈ మ్యాచ్ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైభవ్ సూర్యవంశీ మరో మ్యాచ్ వరకు వేచి చూడాల్సి ఉంటుందని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టును హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపిక చేస్తారని స్పష్టం చేశాడు. 'టీమ్ కాంబినేషన్ విషయంలో మా కెప్టెన్, హెడ్ కోచ్‌దే తుది నిర్ణయం. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అతను ఆడకపోయినా వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో టీమిండియాకు ఎంపికవ్వడమే గొప్ప కదా.

వైభవ్ సూర్యవంశీకి కచ్చితంగా అవకాశాలు వస్తాయి. కేవలం అతన్ని ఆడించేందుకు ఇప్పటికే జట్టులో నిలకడగా పరుగులు చేస్తూ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆటగాళ్లను తప్పించలేం కదా? అలా చేయడం కూడా భావ్యం కాదు. ఒకరికి అవకాశం ఇచ్చేందుకు బాగా ఆడుతున్న మరొక ఆటగాడిని బలి చేయడం అన్యాయమే అవుతుంది.'అని సితాన్ష్ కొటక్ అభిప్రాయపడ్డాడు. ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీ మిడిలార్డర్‌లో ఆడలేడు. అతని కోసం సంజూ శాంసన్, అభిషేక్ శర్మలో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శనతో జట్టులో పాతుకుపోయారు.
సంజూను తప్పించడం అన్యాయం..
అయితే సంజూ శాంసన్ మిడిలార్డర్‌లో కూడా ఆడగలడు. గతంలో శుభ్‌మన్ గిల్ కోసం అతన్ని మిడిలార్డర్‌కు డిమోట్ చేయగా.. ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. టీ20 ప్రపంచకప్ 2026లో మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగి వరుసగా 94*, 89, 89 పరుగులతో సత్తా చాటాడు. భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడిని 15 ఏళ్ల వైభవ్ కోసం మళ్లీ మిడిలార్డర్‌కు డిమోట్ చేయడం, జట్టు నుంచి తప్పించడం భావ్యం కాదు.
ఫస్ట్ డౌన్‌లో ఆడే ఇషాన్ కిషన్ కూడా టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాడు. ఆ జోరును ఐపీఎల్‌తో పాటు వన్డే సిరీస్‌లోనూ చూపించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగాలనుకుంటే వైభవ్ బరిలోకి దిగుతాడు. లేదంటే రెండో మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.
అయితే వైభవ్ సూర్యవంశీ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌గా 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించాడు. శ్రీలంక-ఏతో ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి భారత్-ఏకు టైటిల్ అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

