సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపర్చారు. భారీ అంచనాలతో ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో బరిలోకి దిగిన రోహిత్, కోహ్లీ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారి వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది.
అయితే కోహ్లీ, రోహిత్ వైఫల్యానికి వాతావరణమే కారణమని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించాడు. ఒక్క మ్యాచ్‌లో రాణించలేకపోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. రోహిత్, విరాట్‌కు ఎంతో అనుభవం ఉందని, ఎలా ఫామ్ అందుకోవాలో వారికి తెలుసని చెప్పాడు.

'రోహిత్, విరాట్ కోహ్లీ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వారు ఆటకు దూరమయ్యారని అనుకోవడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్ ఆడారు. ఇప్పుడు అత్యుత్తమంగా సన్నద్దమయ్యారు. అయితే తొలి వన్డేకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. వాతావరణం వల్ల ఆటపై ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేసినా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యేవి.
ఇన్నింగ్స్‌కు నాలుగైదు సార్లు అంతరాయం కలిగింది. సీనియర్ ప్లేయర్లకు గొప్ప అనుభవం ఉంది. ఆస్ట్రేలియాకు రాకముందు మంచిగా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఒక్క మ్యాచ్‌లో సరిగా ఆడనంత మాత్రాన వారి ఆటను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిట్‌నెస్ విషయంలోనూ వారికి ఏలాంటి ఇబ్బంది లేదు. మంచి టచ్‌లో ఉన్నారు. నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశారు. రెండో వన్డేలో తప్పకుండా రాణిస్తున్నారు.'అని సితాన్సు కోటక్ చెప్పుకొచ్చాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. దాంతో అడిలైడ్ వన్డే టీమిండియాకు చావో రేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌లో నిలవనుంది. లేదంటే సిరీస్ ఆసీస్ కైవసం కానుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.