
మెల్‌బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో రనౌట్ సమీక్షలపై థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంపైర్ల పక్షపాత ధోరణీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా టిమ్ పైన్ రనౌట్ సమీక్షలో నాటౌట్ ఇచ్చిన థర్డ్ అంపైర్.. ఇంచు మించు అదే తరహాలో ఉన్న భారత కెప్టెన్ అజింక్యా రహానే రనౌట్ సమీక్షలో మాత్రం ఔటివ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
అయితే ఈ రెండు ఘటనల్లో అంపైర్ సరైన నిర్ణయం తీసుకున్నాడని ప్రముఖ అంపైర్ సైమన్ టఫెల్ వివరించాడు. పైన్ ఎందుకు నాటౌటో.. రహానే ఎందుకు ఔటో కూడా వివరించాడు. పైన్ విషయంలో బెయిల్స్ ఎగరలేదని, కానీ రహానే విషయంలో బెయిల్స్ సపరేట్ అయ్యాయని స్పష్టం చేశాడు. 'స్టంప్స్ వేరు అయ్యే విషయంలో ఓ క్లారిటీ ఉంది. పైన్ రనౌట్ విషయంలో బెయిల్స్ ఎగరలేదు. కానీ రహానే విషయంలో బెయిల్స్ గాల్లోకి లేచినట్లు స్పష్టంగా కనబడుతుంది. అలాగే పైన్ సమీక్ష చాలా టఫ్‌గా ఉంది. బ్యాట్ క్రీజులో లేదనడానికి కావాల్సిన ఆధారం లేదు. దాంతో బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మన్ కింద పైన్‌ను థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ నిర్ణయం సరైందే. కానీ రహానే బ్యాట్ లైన్ దాటక ముందే బెయిల్స్ గాల్లోకి లేచాయి. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఔటిచ్చారు.'అని సైమన్ టఫెల్ వివరించాడు.
అయితే ఇక్కడ చాలా మంది రహానేది ఔట్ అని అంగీకరించడంతో పాటు పైన్‌ది కూడా ఔటేనని వాదిస్తున్నారు. 'నా దృష్టిలో పైన్ రనౌటే.. అతని బ్యాట్ కాస్త కూడా లైన్ లోపల లేదు'అని షేన్ వార్న్ అనగా.. భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్‌లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పైన్ ఔటేనని స్పష్టం చేశారు. ఇక పైన్ నాటౌట్ ఇచ్చిన భారత్‌కు పెద్దగా నష్టం జరిగిందేం లేదు కానీ.. రహానే రనౌట్ మాత్రం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అతని వికెట్ తర్వాత 32 పరుగులకే కుప్పకూలింది.
ఇక అడిలైడ్ ఘోర పరాజయాన్ని మరిపిస్తూ.. బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత అదరగొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకున్నా.. సూపర్ బౌలింగ్, తాత్కలిక సారథి రహానే అద్భుత సెంచరీతో ఆసీస్‌పై ఆధ్యాంతం ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 పరుగులకు పరిమితం చేసిన.. భారత్ బదులుగా 326 పరుగులు చేసి 131 రన్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను 6 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసింది. కేవలం 2 పరుగుల ఆధిక్యంలోనే ఆసీస్ ఉండగా.. మిగిలిన నాలుగు వికెట్లు ఎంత త్వరగా తీస్తే భారత విజయం అంత సులువు కానంది.