న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతో దూరం కాగా.. తాజాగా వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరూ ఒకే తరహా గాయంతో జట్టుకు దూరమయ్యారు. సైడ్ స్ట్రెయిన్ గాయంతో ఇబ్బంది పడుతున్నారు.
రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ భారత జట్టులోకి రాగా.. సుందర్ గాయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అతని స్కానింగ్ రిపోర్ట్ బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఇద్దరు ఆటగాళ్లను జట్టుకు దూరం చేసిన సైడ్ స్ట్రెయిన్ గాయం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
శరీరంలోని పక్కటెముకల దగ్గర ఉండే కండరాల్లో చీలిక రావడం లేదా విపరీతంగా సాగడాన్ని సైడ్ స్ట్రెయిన్ అంటారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే ఒక బ్యాటర్, బౌలర్ వంగినప్పుడు, ఆకస్మాత్తుగా కదిలినప్పుడు పక్కటెముకల కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఒత్తి ఎక్కువైనప్పుడు కండరాల్లో చీలిక రావడం లేదా సాగడం జరుగుతుంది. అలాంటి సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.

అతిగా వంగడం, అలసట, సరైన వార్మప్ లేకపోవడం, బౌలింగ్ యాక్షన్ వల్ల ఈ గాయం అవుతుంది. బౌలింగ్ యాక్షన్ సమయంలో శరీరాన్ని ఒకవైపు వేగంగా వంచి, మరోవైపు లాగడం వల్ల కండరాలపై ఒత్తిడిపడుతుంది. తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడటం వల్ల కండరాలు బలహీనపడుతాయి. సరైన వార్మప్ లేకుండా శరీరాన్ని వేగంగా కదిలించినప్పుడు ఇలా జరుగుతుంది.
ఊపిరి పీల్చుకున్నప్పుడు, దగ్గినప్పుడు, శరీరాన్ని అటు ఇటు తిప్పినప్పుడు పక్కటెముకల దగ్గర విపరీతమైన నొప్పి వస్తుంది.
బ్యాటింగ్, బౌలింగ్ చేయకపోవడం, సరిగ్గా నిలబడలేకపోవడం వంటివి జరుగుతాయి.
సాధారణ గాయమైతే 2 నుంచి 4 వారాల్లో నయమవుతుంది. అలా కాకుండా గ్రేడ్ 1, 2, 3 చీలిక వస్తే 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రేడ్ 1 గాయం వారం నుంచి రెండు వారల్లో నయమవుతుంది. గ్రేడ్ 2 గాయానికి 3 నుంచి 6 వారాలు, గ్రేడ్ 3 గాయం నయమవడానికి 8 నుంచి 12 వారాల సమయం పడుతుంది. పంత్‌కు గ్రేడ్ 3 గాయం కావడంతో అతను కోలుకోవడానికి 8 వారాల సమయం పట్టనుంది. సుందర్ గాయం తీవ్రత తెలియాల్సి ఉంది.
గాయమైన తొలి 48 నుంచి 72 గంటల వరకు విశ్రాంతి తీసుకోమంటారు. ముఖ్యంగా గాయమైన వైపు ఒత్తిడి పడకుండా చూసుకోవాలంటారు. నొప్పి, వాపును తగ్గించడానికి 2-3 గంటలకోసారి 15 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. పక్కటెముకల కండరాలకు సపోర్ట్ ఇచ్చేలా మెడికల్ బ్యాండేజ్ వాడతారు. పడుకున్నప్పుడు నొప్పి ఉన్న వైపు ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడటం. నొప్పి తీవ్రతను తగ్గించడానికి వైద్యులు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. నొప్పి కొంచెం తగ్గాక ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో సున్నితంగా మసాజ్ చేస్తారు. అనంతరం తేలికపాటి వ్యాయామాలు చేయిస్తారు. క్రికెటర్లు అయితే నేరుగా మ్యాచ్ బరిలోకి దిగకుండా.. చిన్నపాటి రన్నింగ్, నెట్స్‌లో తక్కువ వేగంతో బౌలింగ్ చేయిస్తారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే మ్యాచ్ ఆడిస్తారు.