ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన టీమిండియా ఆ జోరును కొనసాగించలేకపోయింది. తొలి రోజు పర్వాలేదనిపించిన భారత్.. రెండో రోజు పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైంది. తొలి రోజు ఆటకు 94 పరుగులు మాత్రమే జోడించింది. అనంతరం బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచింది. ఈ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ భారత బౌలర్లను చెడుగుడు ఆడారు. బజ్‌బాల్ బ్యాటింగ్‌తో పరుగుల మోత మోగించారు.
తొలి ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రాతో వేయించిన శుభ్‌మన్ గిల్.. రెండో ఓవర్‌ను అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ఇచ్చాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకుతో పాటు ఒత్తిడితో బౌలింగ్ చేసిన అన్షుల్.. లైన్ మిస్సయ్యాడు. దాంతో బెన్ డకెట్ మూడు బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చాడు. ఈ మూడు బౌండరీలు ఇంగ్లండ్ ఓపెనర్లు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. లార్డ్స్ టెస్ట్‌లో కొత్త బంతితో మెరుగైన ప్రదర్శన చేసిన సిరాజ్‌తో కాకుండా అన్షుల్ కంబోజ్‌కు బంతినిచ్చి గిల్ ఘోర తప్పిదం చేశాడు. కామెంటేటర్లు సైతం శుభ్‌మన్ గిల్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఫస్ట్ స్పెల్‌ను ప్రైమ్ బౌలర్లతో వేయించాలని, ఈ విషయంలో గిల్ తప్పు చేశారని అన్నారు.

క్రీజులో సెట్ అయిన బెన్ డకెట్, జాక్ క్రాలీ.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. బుమ్రాపై కూడా ఎదురు దాడికి దిగారు. ఆ తర్వాత సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. జడేజా వచ్చి ఈ జోడీని విడదీసాడు. స్పిన్ ప్రభావం చూపుతున్నప్పుడు శుభ్‌మన్ గిల్.. వాషింగ్టన్ సుందర్‌కు ఒక్క ఓవర్ వేయలేదు. గిల్ కెప్టెన్సీ తప్పిదాలతో బౌలర్లు మూల్యం చెల్లించుకున్నారు.
ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 46 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(100 బంతుల్లో 13 ఫోర్లతో 94), జాక్ క్రాలీ (113 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 84) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. క్రీజులో ఓలిపోప్(16 బ్యాటింగ్)తో పాటు జోరూట్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ అన్షూల్ కంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసారు.
అంతకుముందు 264/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు. ఇంగ్లండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.