టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా ఘోర పరాజయాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక సలహా ఇచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియా పూర్వ వైభవం అందుకోవాలంటే ప్రతీ సిరీస్‌కు ముందు 15 రోజుల టెస్ట్ క్యాంప్ నిర్వహించాలని బీసీసీఐకి శుభ్‌మన్ గిల్ సూచించాడు. ఈ విషయాన్ని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ముఖ్యంగా 2024లో న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ కోల్పోయి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను చేజార్చుకుంది.
ఈ పరాజయాల అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాను మరింత కష్టాల్లో నెట్టింది. రోహిత్ శర్మ వారసుడిగా సారథ్య బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్.. ఇంగ్లండ్ పర్యటనలో ముందుండి జట్టును నడిపించాడు. 754 పరుగులతో రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచి సిరీస్ సమమవ్వడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ తర్వాత భారత్ వేదికగా జరిగిన వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ను కూడా భారత్ గెలిచింది. కానీ సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో మాత్రం మరోసారి క్లీన్ స్వీప్ అయ్యింది. వరుసగా రెండేళ్లలో రెండు సిరీస్‌ల్లో భారత్ క్లీన్ స్వీప్‌కు గురికావడం విమర్శలకు దారి తీసింది. భారత టెస్ట్ క్రికెట్ మనుగడపైనే ప్రశ్నలు తలెత్తాయి.
ఈ పరాజయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బోర్డు.. టీమ్‌మేనేజ్‌మెంట్ వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్.. టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రతీ సిరీస్‌కు ముందు 15 రోజుల టెస్ట్ క్యాంప్ నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించాడు.
'టెస్ట్ సిరీస్‌కు వెళ్లే ముందు భారత జట్టుకు మెరుగైన సన్నద్దత అవసరమని శుభ్‌మన్ గిల్ సూచించాడు. బిజీ షెడ్యూల్ కారణంగా జట్టు ప్రిపరేషన్‌కు తగిన సమయం దొరకడం లేదని, ప్రతీ టెస్ట్ సిరీస్‌కు ముందు 15 రోజుల టెస్ట్ క్యాంప్ నిర్వహిస్తే బాగుటుందని చెప్పాడు.
శుభ్‌మన్ గిల్ తన నాయకత్వ లక్షణాలను చాటుకుంటున్నాడు. సెలెక్టర్లతో పాటు బోర్డుకు తన లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టుకు బలమైన కెప్టెన్ అవసరం ఉన్న నేపథ్యంలో ఇది మంచి పరిణామం. టెస్ట్, వన్డే జట్లు శుభ్‌మన్ గిల్ పరిధిలో ఉన్నందున, కీలక నిర్ణయాల్లో అతని పాత్ర ఉండటం ముఖ్యం.
కొన్ని సందర్భాల్లో టెస్ట్ సిరీస్ సమీపిస్తున్న సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైట్ బాల్ సిరీస్‌లతో బిజీగా ఉండవచ్చు. అలాంటి సమయంలో రెడ్ బాల్ క్యాంపులను నిర్వహించడానికి నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ సేవలను బోర్డు ఉపయోగించుకునే అవకాశం ఉంది.'అని సదరు అధికారి వెల్లడించాడు.