అబ్బే.. మాకేం పోటీలేదు : శుభ్‌మన్ గిల్

హామిల్టన్: గాయాలతో టీమిండియా రెగ్యూలర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు దూరమవ్వడం.. వారి స్థానాల్లో వచ్చిన మయాంక్ అగర్వాల్, పృథ్వీషాలు దారుణంగా విఫలమవ్వడంతో టెస్ట్ సిరీస్‌కు ఓపెనర్లు ఎవరబ్బా? అనే చర్చ జోరు అందుకుంది. మాజీ క్రికెటర్ల మధ్య ఈ డిబేట్ జోరుగా సాగుతోంది.
టెస్ట్ జట్టులో శుభమన్ గిల్, మయాంక్, పృథ్వీషా ముగ్గురు ఓపెనర్లు అందుబాటు ఉండటం.. సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ జట్టులో లేకపోవడం.. అనాధికారిక టెస్టుల్లో శుభమన్ మెరుపులు మెరిపించడంతో ఏ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందనేదానిపై విశ్లేషణలు జోరు అందుకున్నాయి.
మయాంక్ అగర్వాల్‌తో కలిసి పృథ్వీ షా బరిలోకి దిగుతాడా.. లేక మయాంక్-శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారా అనే దానిపై స్పష్టత లేకపోయింది. టీమ్‌మేనేజ్‌మెంట్‌కు కూడా ఓ తలనొప్పిగా మారింది. అయితే ఓపెనింగ్ స్థానం కోసం తన సహచర ఆటగాడు పృథ్వీ షాతో పోటీపై శుభ్‌మన్ గిల్‌ను ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు.

టీమ్‌మేనేజ్‌మెంట్ హెడెక్..
పృథ్వీ షాతో తనకెలాంటి పోటీలేదని, తుది జట్టులో ఎవరిని ఆడించాలనేది టీమ్‌మెనేజ్‌మెంట్ హెడెక్ అని శుభ్‌మన్ చెప్పుకొచ్చాడు. ‘పృథ్వీ షాతో నాకెలాంటి పోటీలేదు. మా ఇద్దరిలో ఎవరికి అవకాశం వచ్చినా జట్టు కోసమే ఆడతాం. ఒకరితో ఒకరు పోటీ పడటం కోసం ఇక్కడి రాలేదు. వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకోవడం కోసమే వచ్చాం. తుది జట్టులో ఎవరు ఉండాలనేది మా సమస్య కాదు. అది మేనేజ్‌మెంట్ తలనొప్పి.
మా ఇద్దరి కెరీర్ ఒకేసారి ప్రారంభమైంది. అంత మాత్రాన మా మధ్య పోరు అనేది ఎప్పుడూ చోటు చేసుకోలేదు.. చోటు చేసుకోదు కూడా. ఇప్పటివరకూ మాకు దక్కిన అవకాశాల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోనే ఇంతవరకూ వచ్చాం. భారత సీనియర్ జట్టు తరఫున ఎవరు ఆడతారు అనేది మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది. ఎవరికి అవకాశం వచ్చినా అది వృథా కాకుండా ఆడటమే మా ముందున్న లక్ష్యం' అని గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ నెల 21 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. అంతకుముందుగా న్యూజిలాండ్ ఎలెవన్‌తో భారత్ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

శుభ్‌మన్‌కు అవకాశం ఇవ్వాలి..
ఇక వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌తో శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అభిప్రాయపడ్డాడు. ‘జట్టులో రిజర్వ్ ఓపెనర్‌గా ఉంటూ అవకాశాలు అందుకోని శుభ్‌మన్‌గిల్‌కు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి. మరోవైపు మయాంక్‌ను ప్రధాన ఓపెనర్‌గా కొనసాగించాలి. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో టాప్ బ్యాట్స్‌మన్‌గా అతనేంటో నిరూపించుకున్నాడు. అతను గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. మూడు వన్డేలు, ఒక ప్రాక్టీస్‌లో విఫలమయ్యాడని అతన్ని పక్కనపెట్టకూడదు. అలా చేస్తే ఫలితం ఉండదు. అతను ఆడిన సమయంలో చాలా పరుగులు చేశాడు. కాబట్టి తొలి టెస్ట్‌లో మయాంక్, శుభ్‌మన్ ఓపెనింగ్ చేయాలనుకుంటున్నా.'అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.

పృథ్వీషానే ఓపెనింగ్ చేయాలి..
ఇక భారత మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్త మాత్రం హర్భజన్ అభిప్రాయాన్ని విభేదించాడు. ఓపెనర్‌గా పృథ్వీషానే బరిలోకి దిగాలన్నాడు. ‘శుభ్‌మన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని అర్థమవుతుంది. కానీ మనమంతా గుర్తుతెచ్చుకోవాల్సింది ఏంటంటే.. మయాంక్ కన్నా ముందు పృథ్వీషానే టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు. అద్భుతంగా రాణించాడు. గాయపడేంతవరకు అతనే ఫస్ట్ చాయిస్‌గా ఉన్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా అతను మంచి టచ్‌లో ఉన్నాడు. గాయంతో దూరమైన పృథ్వీకి మళ్లీ అవకాశం ఇవ్వాలి. శుభ్‌మన్ కొంతకాలం వేచి ఉండాలి'అని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications